ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలోని పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. గత రెండురోజులుగా జరుగుతున్న తనిఖీల్లో భారీగా బియ్యం పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. రేషన్ షాపుల నుంచి దళారుల ద్వారా మిల్లులకు చేరుతూ తిరిగి ప్రజా పంపిణీకి బియ్యం చేరుకుంటున్నాయి. ఇలా అక్రమార్కులు భారీగా దండుకొంటున్నారు.
జిల్లాలోని 2,353 రేషన్ దుకాణాల ద్వారా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బియ్యంతోపాటు కందిపప్పు, శనగలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది మార్చి చివరిలో కొవిడ్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించటంతో అప్పటినుంచి ఉచిత పంపిణీ మొదలైంది. ఆ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఎవై) పథకాన్ని ప్రారంభించి అప్పట్నుంచి ఉచితంగా రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి అయిదు కిలోలు, కేజీ కందిపప్పు అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అదే మొత్తంలో బియ్యంతోపాటు కిలో శనగలను పంపిణీ చేస్తున్నారు. గతంలో నెలకు ఒకసారి మాత్రమే వచ్చే రేషన్‌ను నెలలో రెండుసార్లు ఇస్తున్నారు. ఒకే నెలలో పెద్ద మొత్తంలో పేదల కుటుంబాలకు బియ్యం అందజేస్తుండటం వాటిని కొందరు తీసుకోకపోవడంతో డీలర్ల వద్ద భారీగా మిగిలిపోతున్నాయి. ఇలా మిగిలిన బియ్యం అక్రమ మార్గంలో ట్రేడింగ్, నాన్ ట్రేడింగ్ మిల్లులకు చేరుకుంటున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ట్రేడింగ్ మిల్లులపై సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు. విజయవాడ ముత్యాలంపాటు శ్రీనగర్ కాలనీలో ఒక రేషన్ దుకాణంలో దాదాపు 1200 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని బుధవారం విజిలెన్స్ అధికారులు గుర్తించారు.