కృష్ణా జిల్లాలోని దివిసీమలో గాంధీజీ అంటే గుర్తుకు వచ్చేది గాంధీక్షేత్రం. అవనిగడ్డలో ఉన్న ఈ క్షేత్రం సేవా కార్యక్రమాలకు శాశ్వత చిరునామాగా పేరు ప్రఖ్యాతలు గడించింది. దివిసీమ గాంధీగా పిలిచే మండలి వెంకట కృష్ణారావు 1969లో దీనిని స్థాపించారు. గాంధీ క్షేత్రం నేటికీ 51 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
సేవా కార్యక్రమాలకు చిరునామా... దివిసీమ గాంధీ క్షేత్రం - diviseema latest news
కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గాంధీ క్షేత్రం నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా 1969లో దీనిని మండలి వెంకట కృష్ణారావు స్థాపించారు. 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ క్షేత్రం... సేవా కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గాంధీజీ 151వ జయంతి సందర్భంగా ఈ క్షేత్రంపై ప్రత్యేక కథనం.
ఈ క్షేత్రం కింద ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు మండలి. దివిసీమలో 1977లో తుపాను బీభత్సం అనంతరం ఓ యజ్ఞంలా మొక్కలను నాటారు. అలాగే విద్యార్థులలో నైపుణ్యం వెలుగులోకి తీసి.. వారు కోరుకున్న వృత్తి విద్యలో శిక్షణ ఇప్పించడం... స్త్రీ సంక్షేమం వంటి పలు సేవా కార్యక్రమాలను చేపట్టింది. అనాథ బాలబాలికలకు ఆశ్రమం కలిగించడమే కాకుండా.. వారికి విద్యా బోధన అందించడంలో గాంధీక్షేత్రం విశిష్ట కృషి చేసింది. ఖద్దరును పోత్సహించటానికి దివిసీమలో ఇప్పటికి ఖాదీ బండాగారం షాపులు పనిచేస్తూనే ఉన్నాయి. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలోని ఛాయాచిత్రాలు చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలాయి. క్షేత్రంలో అడుగుపెట్టగానే ఛాయాచిత్రాలు అందరి మదిలో ఆలోచన రేకిత్తిస్తున్నాయి.