NTR Souvanier Comittee Visit Nimmakuru: ఎన్టీఆర్ ప్రసంగాల గ్రంథాన్ని ఈ నెల 28వ తేదీన విజయవాడలో ఆవిష్కరించనున్నట్లు ఎన్టీఆర్ శతజయంతి కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ తెలిపారు. చంద్రబాబు, బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్‌పై తొలి గ్రంథం రాసిన వ్యక్తి, సీనియర్ జర్నలిస్ట్ వెంకట నారాయణ హాజరు కానున్నారని వెల్లడించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సావనీర్, వెబ్సైట్ కమిటీల పర్యటించింది. కమిటీల సభ్యులకు పామర్రు టీడీపీ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్వాగతం పలికారు.
నిమ్మకూరులో ఎన్టీఆర్ సావనీర్ కమిటీ పర్యటన కమిటీ సభ్యులు ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళులర్పించారు. వెబ్ సైట్, సావనీర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో పెడతామన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వెబ్సైట్, యాప్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కారదర్శి లోకేశ్ ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ సావనీర్లో సినీ, రాజకీయ రంగాల్లోని విశేషాలు ఉంటాయని తెలిపారు. ఎన్టీఆర్‌తో అనుబంధం ఉన్న వ్యక్తుల ఇంటర్వ్యూలు చేస్తున్నామని.. సావనీర్లో పొందపరుస్తామని వివరించారు.
వేటపాలెం లైబ్రరీ నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించిన చాలా సమాచారం సేకరించినట్లు టీడీ జనార్దన్ తెలిపారు. నదుల అనుసంధానం తరహాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ వేడుకల సందర్భంగా వివిధ రంగాల వాళ్లందరూ అనుసంధానం అయ్యామన్నారు. ఎన్టీఆర్ చేపట్టిన వివిధ కార్యక్రమాల వెనుకున్న కారణాలేంటోననే విషయాన్ని సావనీర్-వెబ్ సైట్లల్లో పొందుపరిచామని చెప్పారు.
చారిత్రక ప్రసంగాలను కష్టపడి సేకరించామని తెలిపారు. 'జయహో ఎన్టీఆర్' అనే పేరుతో వెబ్ సైట్ రాబోతోందన్నారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం తమదని సావనీర్-వెబ్ సైట్ కమిటీ సభ్యుడు శ్రీపతి సతీష్ అన్నారు. ఎన్టీఆర్ అభిమానిగా ఉన్న తమ తండ్రి శ్రీపతి రాజేశ్వరరావుకు రాజకీయ భిక్ష పెట్టారని, మంత్రిని చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా సీఎన్ఎన్ సర్వేలో ఆయనే దేశంలోని పాపులర్ వ్యక్తిగా గుర్తింపు పొందారన్నారు. ఏ ఇతర వెబ్ సైట్లల్లో లేని సమాచారం తాము రూపొందించే వెబ్ సైట్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
"ఎన్టీఆర్ సినిమాల్లో నటించే సమయంలో గానీ, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గానీ ఆయన చేసినటువంటి పనులు చాలా మహోన్నతమైనవి. ఆయన రాజకీయాల్లోకి వచ్చేంత వరకు కూడా ఎవరూ సంక్షేమాన్ని ఊహించలేదు. భావితరాలకు ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఔన్నత్యం, ఆయన చేసిన గొప్ప పనులన్నీ తెలియజేయటం, చరిత్రలో ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చాటి చెప్పటమే మా కమిటీ ఉద్దేశం. అందుకోసం ఆయన గురించి సమాచారం ఉన్నవారిని వాటి గురించి పంపించమని ప్రపంచంలో చాలా మందిని మేము కోరాము. ఈ సమాచారాన్ని అంతటినీ పొందుపరిచి.. భావితరాలకు అందజేసేందుకు మా కమిటీ కృషి చేస్తోంది." - టీడీ జనార్దన్, టీడీపీ నేత
ఇవీ చదవండి: