విజయవాడలోని రాష్ట్ర పర్యటక శాఖలో ఎస్టేట్ అధికారిగా పనిచేస్తోన్న రాచూరి శివరావు నివాసాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేసింది.విజయవాడ టిక్కిల్ రోడ్డు స్మితాటవర్స్‌లోని ప్లాట్ తో పాటూ మరో ఐదు చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. స్థిర, చర ఆస్తులు అన్నీ కలిపి సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఉంటాయని అనిశా అంచనా వేస్తోంది.
'అత్త'పేరిట ప్లాట్లు..
శివరావు, అతని కుటుంబ సభ్యులు, బినామీల పేరిట 14 ప్లాట్లు, రెండు ఇళ్లు, ఒక ఆర్.సి.సి.రూఫ్ గది, 96 సెంట్ల వ్యవసాయ భూమి ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఆయన అత్త దార్ల చిట్టెమ్మ పేరిట విజయవాడ నగరంలో మూడు, గుంటూరు జిల్లా నంబూరులో రెండు, కృష్ణా జిల్లా చిట్టిగూడురులో ఒకటి మొత్తం 8ప్లాట్లు ఉన్నట్లు వారు తెలిపారు. వాటికి సంబంధించిన దస్త్రాలను అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 18 లక్షల రూపాయల నగదు, 793 గ్రాముల బంగారం, కేజీ వెండి ఆభరణాలు, 20 లక్షల రూపాయల ప్రైవేటు చీటీల బాండ్లు, ఒక కారు, రెండుద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
స్వాతంత్య్రసమరయోధుడి భూమి కూడా..
1986లో స్వాతంత్ర్య సమరయోధుడుకేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన 1.5 ఎకరాల అసైన్డ్ భూమిని శివరావు తన బావ పేరిట బదలాయించినట్లు అనిశా విచారణలో వెల్లడైంది.
1987లో రెవెన్యూ శాఖలో టైపిస్టుగా చేరిన శివరావు తర్వాత తహసీల్దార్గాపదోన్నతి పొందారు. 2012 నుంచి 2018 వరకు విజయవాడ అర్బన్ తహశీల్దారుగా పనిచేసిన ఆయన... 2018 ఏప్రిల్ నుంచిడెప్యూటేషన్‌పై పర్యటకశాఖలో ఎస్టేట్ ఆఫీసరుగా పనిచేస్తున్నారు.