ఇక్కడ కనిపిస్తున్న ఈ అవ్వాతాతల పేర్లు.... తుకాణం, అంజమ్మ. వీరిది ప్రేమ వివాహం. నెల్లూరు జిల్లాకు చెందిన..... వీరికి సంతానం లేరు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. సొంతంగా పొలం లేకున్నా... కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. బాగా బతుకుతూనే.. ఉన్నంతలో పది మందికి సాయం చేసేవారు. కానీ కాలం కలిసిరాలేదు. విధి వీరిని వెక్కిరించింది. వ్యవసాయం కాస్తా భారమైంది. పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక పొట్ట చేతపట్టుకొని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌కు వలస వచ్చారు. ఇక్కడే ఓ పోరంబోకు స్థలంలో పూరిగుడిసె వేసుకుని జీవితం ప్రారంభించారు. ఆ స్థలంపై రాజకీయ నాయకుల కళ్లు పడి అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించారు. అప్పటి నుంచి వీరికి ఉండటానికి ఇల్లు లేదు. కరోనాతో ఉపాధి లేక పస్తులు గడపాల్సిన పరిస్థితి ఎదురైంది.
అంజమ్మను కొంతకాలంగా అనారోగ్యం వెంటాడుతోంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆమెను... అతను విడిచి బయట పనికి వెళ్లలేక మంచినీటితోనే కడుపు నింపుకొంటున్నాడు. వారి దయనీయ స్థితిని ఈనాడు వెలుగులోకి తీసుకురాగా... ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఆ వృద్ధులను ఓ అద్దె ఇంట్లో చేర్చి వారికి ఏడాదికి సరిపడా నిర్వహణ ఖర్చులు భరిస్తానని లయన్స్ క్లబ్ గవర్నర్ పుట్టగుంట సతీష్ కుమార్ హామీ ఇచ్చారు. జనసేన, చిరంజీవి అభిమాన సంఘం ప్రతినిధులు... ఆ దంపతులకు 50 వేల నగదు ఇవ్వడానికి ముందుకొచ్చారు. స్థానిక నేతలు పలువురు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు.