ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగనన్న వచ్చి చేసిందేమీ లేదు'.. బిల్లుల కోసం ఇసుక కాంట్రాక్టర్ల ఆందోళన - Concern of contractors

Sand contractors are angry : మూడేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఇసుక రవాణా, లోడింగ్ చేసిన కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి ఇసుక రవాణా చేస్తే.. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించి తమ బిల్లులు చెల్లించాలని లేనిపక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు.

ఇసుక కాంట్రాక్టర్లు
ఇసుక కాంట్రాక్టర్లు

By

Published : Mar 1, 2023, 5:41 PM IST

Sand Contractors Agitation : అన్న వస్తాడు.. మాకు న్యాయం చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి జగన్ తమను రోడ్డుకు లాగుతున్నారని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎదుట ఇసుక రవాణా, లోడింగ్ కాంట్రాక్టర్లు వాపోయ్యారు. తాము చేసిన పనికి సంబంధించి 2021 నుంచి బిల్లులు చెల్లించడం లేదని మండిపడుతున్నారు. పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తాడిగడప రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట కృష్ణా, గుంటూరు జిల్లాల చెందిన ఇసుక రవాణా, లోడింగ్ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నామని, తాము భవనం పైనుంచి దూకి చనిపోతామని బిల్డింగ్ ఎక్కేందుకు ప్రయత్నించిన కాంట్రాక్టర్లను.. సంస్థ సిబ్బంది అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బిల్లుల కోసం ఇసుక కాంట్రాక్టర్ల ఆందోళన

ప్రభుత్వం మోసం చేస్తుందనుకోలేదు.. ప్రభుత్వం, ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు.. తమను పురుగులకంటే హీనంగా చూస్తున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఖనిజాభివృద్ధి సంస్థకు ఇసుకను సరఫరా చేశామని, సంస్థ ఆ ఇసుకను కూడా అమ్మేసిందని, మరి మాకు డబ్బులు ఇవ్వడానికి ఎందుకు మనసు రావడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి ఇసుకను సరఫరా చేశామని, ప్రభుత్వం ఇలా మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. అప్పులు ఇచ్చిన వారు తమ ఇళ్ల వద్దకు వచ్చి నానా మాటలు అంటున్నారని, అప్పులు ఎలా తీర్చాలో కూడా తెలియడం లేదని పేర్కొన్నారు. 2021 మే నుంచి బిల్లులు చెల్లించడం లేదని.. అప్పుటినుంచి సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నెలల పాటు కాలయాపన చేస్తూ తమను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు.

హామీలన్నీ బుట్టదాఖలు.. అప్పుల బాధ తట్టుకోలేక గతంలో ఇదే కార్యాలయం ముందు ధర్నా చేశామని కాంట్రాక్టర్లు తెలిపారు. ఆ సమయంలో 2023 ఫిబ్రవరి 25 లోపు బకాయి బిల్లులను చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు. అధికారులు హమీ ఇచ్చారు.. ఇంకా మా బిల్లులు వస్తాయి... ఆర్థిక కష్టాల నుంచి విముక్తి చెందుతామని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని కాంట్రాక్టర్లు చెప్పారు. అధికారుల హామీ గాలిలో కలిసిపోయిందని, ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల పైనే బిల్లులు రావాల్సి ఉందని చెప్పారు. మాకు అప్పులు ఇచ్చినవారు ఇళ్ల వద్దకు వచ్చి అవమానకరంగా మాట్లాడుతున్నారని,.. సమాజంలో పరువు పోతుందని కాంట్రాక్టర్లు చెప్పారు. లారీలకు నెలవారీ కీస్తీలు కూడా కట్టుకునే పరిస్థితి లేదని, చాలామంది లారీలను ఫైనాన్స్​ సంస్థలు తీసుకువెళ్లిపోయాయని వాపోయారు. ప్రభుత్వం తీరుతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తప్పని పరిస్థితుల్లోనే నేడు మళ్ళీ ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు.

చర్చలు జరిపిన అధికారులు.. కాంట్రాక్టర్ల ఆందోళన నేపథ్యంలో ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు స్పందించారు. చర్చలు జరిపి ఈనెల చివరికి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కాగా, అధికారుల హామీపై కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిసారీ నెలల తరబడి కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి నెల చివరికి అధికారులు తమ బిల్లులు చెల్లిస్తారనే నమ్మకం లేదని గుత్తేదారులు అనుమానం వ్యక్తం చేశారు. మిగతా కాంట్రాక్టర్లతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

ఎప్పుడొచ్చినా వెయిట్ చేయిస్తున్నారే తప్ప.. మా సమస్యకు ముగింపు ఉండడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. తీరా మేం రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. పోయిన సారి ధర్నా చేస్తే పది రోజుల్లో ఇస్తామన్నారు.. మర్చిపోయారు. ఫిబ్రవరి 15వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాం అన్నారు. మళ్లీ.. 25 వరకు వెయిట్ చెయ్యండి అన్నారు. పట్టించుకోలేదు. ఒక నెలలో చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు. అమలు చేయడం లేదు. మేం ఏపీఎండీసీ యార్డులకు ఇసుక ఇచ్చాం. వాళ్లే సేల్ చేస్తారు. డబ్బులు వచ్చేది కూడా ఏపీఎండీసీకే. ప్రభుత్వం ఇప్పటికైనా మా డబ్బులను రిలీజ్ చేయాలి. అన్న వస్తే బాగుండు అనుకున్నాం, కానీ, అన్న వచ్చి చేసిందేమీ లేదు. మా లారీల కిస్తీలు పెండింగ్ ఉండడం వల్ల బండ్లు సీజ్ అవుతున్నాయి. - ఇసుక రవాణా, లోడింగ్ కాంట్రాక్టర్లు

ముఖ్యమంత్రి జగన్ స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని.., లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అధికారులు ఇచ్చినా హమీని ఏ మేరకు నిలబెట్టుకుంటారో చుస్తామని, లేనిపక్షంలో అందరిని కలుపుకుని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details