ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూర్తికాని రెవెన్యూ భవనాల నిర్మాణం.. నిధుల కోసం ఎదురుచూపులు ఇంకెంతకాలం?

నిధులు మంజూరైనా... విడుదల కాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. శంకుస్థాపనలు చేసిన తరువాత గుత్తేదార్లు పనులు ప్రారంభించి కొంత వరకు చేశారు. ఆయా పనులకు కూడా బిల్లులు రాకపోవడంతో పనుల్ని నిలిపివేశారు.

Revenue buildings construction stopped
నిర్మాణం పూర్తికాని రెవెన్యూ భవనాలు

By

Published : May 4, 2021, 3:17 PM IST

కృష్ణా జిల్లాలో పలుచోట్ల రెవెన్యూ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలన్న యోచనతో గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు చేశారు. నిధులు మంజూరైనా విడుదల కాకపోవడంతో పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. పంచాయతీరాజ్‌ శాఖ మచిలీపట్నం సర్కిల్‌ పరిధిలో రూ.5 కోట్లకుపైగా విలువైన భవన నిర్మాణాలు నిలిచిపోయాయి.

ఏళ్లు గడుస్తున్నా...

జిల్లాలోని పలు ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన తహసీల్దారు కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించేలా గత ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నారు. నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించారు. తరువాత ఎన్నికలు రావడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. ఏళ్లు గడిచిపోతున్నా వీటి గురించి పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం కలెక్టరేట్‌ పరిధిలోని ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు విడుదల చేశారు. 2018 సెప్టెంబరులో ఈ భవన నిర్మాణానికి అప్పటి పాలకులు శంకుస్థాపన చేశారు. అనంతరం పనులు ప్రారంభించినా పునాదుల దశలోనే ఆగిపోయాయి. బందరు, బంటుమిల్లి, కైకలూరు, అవనిగడ్డలో తహసీల్దారు కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో భవనానికి రూ. 90 లక్షల చొప్పున మంజూరు చేశారు. కొన్ని పునాదుల దశలో, మరికొన్ని వివిధ దశల్లో ఆగిపోయాయి. ఈ భవనాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

బిల్లులు రాక నిలిపివేసిన గుత్తేదారులు

కొంతమేర పనులు చేసినా, వాటికి సంబంధించిన నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదార్లు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు బందరు ఆర్డీవో కార్యాలయ భవనానికి రూ.40 లక్షలు, తహసీల్దారు కార్యాలయాల భవనాలకు సంబంధించి బందరులో రూ.25 లక్షలు, కైకలూరులో రూ.19 లక్షలు, బంటుమిల్లిలో రూ. 60 లక్షలు, అవనిగడ్డలో రూ.22 లక్షల చొప్పున మొత్తం రూ. 1.66 కోట్ల విలువైన పనులు జరిగాయని చెబుతున్నారు. నాలుగు తహసీల్దారు కార్యాలయాల భవనాలకు మొత్తం రూ.3.60 కోట్లు విడుదల కావాల్సి ఉంది. పూర్తి చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో గుత్తేదారులు ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు.

శిథిల భవనాల్లోనే విధులు

నిర్మాణాలు పూర్తికాకపోవడంతో శిథిల భవనాల్లోనే ఉద్యోగులు విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. బంటుమిల్లి తహసీల్దారు కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇదే భవనంలో ఖజానా శాఖ కార్యాలయం కూడా ఉంది. ఎప్పుడు పెచ్చులూడి పడతాయో తెలియని పరిస్థితి. బందరు తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయ భవనాలు బ్రిటీష్‌ కాలంలో నిర్మించినవి. ఉద్యోగులు ప్రస్తుతం వాటిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకొన్నేళ్లు జాప్యం చేస్తే ఇప్పటివరకు చేపట్టిన పనులు కూడా వృథా అవుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు పట్టించుకుని త్వరితగతిన భవన నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

సీఐడీ విచారణకు హాజరైన మాజీమంత్రి దేవినేని ఉమ

ABOUT THE AUTHOR

...view details