ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టేనని (rayalaseema lift irrigation project) తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ( Telangana Minister Vemula) అన్నారు. ఆ ప్రాజెక్టును ఆపాలని కృష్ణా బోర్డు ఆదేశించిన విషయం గుర్తు చేశారు. ఈ విషయంపై ఆంధ్ర ప్రాంత నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల అక్రమమని బోర్డు ఆదేశంతో తేలిపోయిందని స్పష్టం చేశారు. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు కట్టవద్దని బోర్టు స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు.
కృష్ణా బోర్డు ఆదేశాల ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఆయన ఏపీ సీఎంను డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రైబ్యునల్ కూడా రాయలసీమ ఎత్తిపోతల కట్టవద్దని చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రతిపక్షాలు రాజకీయాల కోసం రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చిన వారం రోజుల్లోనే కృష్ణా బోర్డుకు లేఖ రాశామని వెల్లడించారు. జులై 25, 2020న మరోసారి కృష్ణా బోర్డుకు లేఖ రాశామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేంద్రానికి, కృష్ణాబోర్డుకు ఏడు లేఖలు రాసినట్లు గుర్తు చేశారు.
రాయలసీమ ఎత్తిపోతలపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి విమర్శించారు. 2005లో వైఎస్ఆర్ రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే అప్పటి కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ హారతి పట్టారన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెరాస బయటకు వచ్చిందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 4 రెట్లు పెంచింది కాంగ్రెస్ హయాంలో కాదా అని మంత్రి ప్రశ్నించారు.