విజయవాడకు సమీపంలోని మల్లవల్లి గ్రామం వద్ద అశోక్ లేల్యాండ్ నెలకొల్పిన బస్సుల తయారీ యూనిట్లో శుక్రవారం ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ తయారయ్యే అశోక్ లేల్యాండ్ బస్సులు దేశవ్యాప్తంగా సరఫరా అవుతాయి. దాదాపు 75 ఎకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ యూనిట్‌ను నెలకొల్పారు. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు, ఎల్‌ఈడీ లైటింగ్, జీరో డిస్‌ఛార్జి.. వంటి సదుపాయాలతో పాటు యూనిట్ లోపల కాలుష్యానికి తావులేని రీతిలో బ్యాటరీతో నడిచే వాహనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. బీఎస్-6 ప్రమాణాలు గల బస్సులనే విజయవాడ యూనిట్లో తయారు చేయనున్నట్లు అశోక్ లేల్యాండ్ అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ యూనిట్‌కు ఏటా 4,800 బస్సులు అందించగల సామర్థ్యం ఉంది. ఈ యూనిట్లో అత్యాధునిక శిక్షణా కేంద్రం, అధునాతన సర్వీస్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాం’’ అని అశోక్ లేల్యాండ్ వెల్లడించింది.
మల్లవల్లిలోని మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో బస్సుల తయారీ యూనిట్ నిర్మాణాన్ని ఈ సంస్థ 2018 మార్చిలో చేపట్టింది. దీనిపై దాదాపు రూ.170 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అన్ని రకాల బస్సులు తయారు చేసేందుకు అనువుగా ఈ ప్లాంటును నిర్మించారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులను సైతం అసెంబుల్ చేసేందుకు వీలుగా ఈ ప్లాంటును తీర్చిదిద్దారు. దక్షిణ భారతదేశంతో పాటు తూర్పు, మధ్యభారత ప్రాంతాల మార్కెట్‌కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో విజయవాడలో పూర్తి బస్సుల (ఫుల్లీ బిల్ట్) తయారీ యూనిట్‌ను అశోక్ లేల్యాండ్ ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఈ యూనిట్లో పూర్తి బాడీతో కూడిన లారీలు సైతం తయారు చేసే అవకాశం ఉందని తెలిసింది.