భూ సేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం' కోసం ప్రైవేటు సంప్రదింపులు ద్వారా భూమిని సేకరించారని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ రాజు హై కోర్టును ఆశ్రయించారు. ఇది చట్టవిరద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. సంప్రదింపుల ద్వారా సేకరించిన భూమిని.. పేదలందిరికీ ఇళ్లు పథకం కింద మూడో వ్యక్తికి కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, 13 జిల్లాల కలెక్టర్లను వ్యాఖ్యల్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... మార్గ దర్శకాలు జారీ చేస్తూ గతేడాది ఆగస్టు 19న జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. సంప్రదింపుల ద్వారా భూమి కొనుగోలు లేదా తప్పనిసరి భూ సేకరణ విధానం ద్వారా భూమి సేకరించాలని కలెక్టర్లకు సూచించారని పిటిషనర్... వ్యాజ్యంలో తెలిపారు. చట్ట విరుద్ధంగా వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ప్రైవేటు భూములు, అసైన్డ్ భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. భూ సేకరణ చట్టం -2013 లో స్పష్టంగా విధివిధానాలున్నాయన్నారు. సేకరణ విషయమై కొన్ని సందర్భాల్లో నిబంధనల మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018లో సవరణ చట్ట తీసుకొచ్చిందని వెల్లడించారు.