జాతీయ రహదారిని తవ్వి వదిలేశారు. ఒకటి కాదు రెండు కాదు. నెలలు గడుస్తోంది. అయినా పట్టించుకునేవారు లేరు. ఫలితంగా.. దుమ్మూధూళి గాల్లోకి ఎగుస్తోంది. ప్రజలను ఆనారోగ్యానికి గురి చేస్తోంది. అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారి పక్కనే ఉన్న మత్స్యకారుల బాలుర ఆశ్రమ పాఠశాల, వసతి గృహంలోకీ దుమ్ము వెళ్తోంది. ఫలితంగా సుమారు 250 మంది ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మోపిదేవి వరకు విస్తరించి ఉన్న 216వ జాతీయ రహదారి పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది.
ఎన్నిసార్లు జాతీయ రహదారి అధికారులకు, గుత్తేదారుకు ఉపాధ్యాయులు, గ్రామస్తులు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. వారానికి ఒకటి రెండు సార్లు దుమ్మురేగకుండా నీళ్ళు చల్లుతున్నా.. ఆ ఫలితమూ నామమాత్రమే. ధూళితో సరిగా చదువుకోలేక పోతున్నామని, ఊపిరి ఆడటం లేదంటున్నారు ఆశ్రమపాఠశాల విద్యార్థులు. భోజనం చేయలంటే ప్లేట్ దుమ్ముతో నిండిపోతోందని... బట్టలు ఉతికి ఎండ బెట్టినా తిప్పలు తప్పడం లేదంటున్నారు. సమస్యను త్వరగా శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని కోరుతున్నారు.