ఇంతకముందు ఆటలంటేనే కస్సుమనే తల్లిదండ్రులు.... ఇప్పుడు వారి పిల్లలను వారే స్వయంగా ఆటస్థలాలకు తోడ్కొని వెళ్తున్నారు. మారుతున్న జీవనవిధానంలో భాగంగా ఆటలను ప్రోత్సహించేవారు కొంతకాలం నుంచే ఎక్కువైనా... కరోనా నేపథ్యంలో మరింత మంది ఆటలను ఆశ్రయిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుదలకు శారీరక శ్రమ ఎంత ముఖ్యమైందో గ్రహించారు. భౌతికదూరం పాటిస్తూ ఆడే ఆటల్లో.... అందరికీ అందుబాటులో ఉండే బ్యాడ్మింటన్‌కు ఇప్పుడు వయోభేదం లేకుండా ఆదరణ పెరుగుతోంది.
మక్కువతో బ్యాడ్మింటన్ ఆడేవారు కొందరైతే.... శారీరక, మానసిక ఉల్లాసానికి ఆడేవారు మరికొందరు. నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీలకు ప్రజలంతా క్యూ కడుతున్నారు. ఓ గంట బ్యాడ్మింటన్ ఆడితే సగటున 480 క్యాలరీలు కరుగుతాయని.... బరువు తగ్గేందుకూ ఇది దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు.....
నిత్యం బ్యాడ్మింటన్ ఆడటం వల్ల.... కండరాలు బలపడటమే కాక.... నిద్రలేమి, కొవ్వు సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. రోజూ బ్యాడ్మింటన్ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నామని పలువురు అంటున్నారు.