ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

public : అధికార పార్టీ నిర్బంధ సభలు..! వచ్చామా... కనిపించామా.. వెళ్లిపోయామా అంటున్న ప్రజలు

Public in meetings : ముఖ్యమంత్రి, మంత్రుల సభల నుంచి జనం బయటకు పారిపోవడం... గేట్లకు తాళాలు వేస్తే మహిళలు సైతం గోడలు దూకి వెళ్లిపోవడం రివాజుగా మారింది. ముఖ్యుల సభకు తప్పనిసరై హాజరవుతున్న ప్రజలు, డ్వాక్రా మహిళలు సభ మధ్యలోనే పరారవుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఏ ప్రాంతమైనా, కార్యక్రమం ఏదైనా... సీఎం, మంత్రుల సభలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 27, 2023, 10:56 AM IST

అధికార పార్టీ సభలు

Public in meetings : పథకాలు ఆపేస్తామని, రుణాలు నిలిపేస్తామని అధికారులు బెదిరించడంతో తప్పనిసరై సభలకు హాజరవుతున్న డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులు.. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రసంగాలు మొదలవగానే పరుగులు తీస్తున్నారు. అధికారులు, పోలీసులు గేట్లు వేసేసి అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. గోడలు, కంచెలు, బ్యారికేడ్లపై నుంచి దూకి మరీ పారిపోతున్నారు. బుధవారం అనంతపురం జిల్లా నార్పలలో సీఎం సభ నుంచి జనం మధ్యలోనే పారిపోయారు. జనాలు వెళ్లిపోకుండా కట్టుదిట్టంగా సభా ప్రాంగణం చుట్టూ మూడంచెల్లో బారీకేడ్లు ఏర్పాటు చేసినా... పారిపోయే వారిని అడ్డుకోవడం ఎవరితరం కాలేదు. బారికేడ్లు తోసుకుని మరీ జనం పారిపోయారు. ఒక్క నార్పలలోనే కాదు, ఇటీవల పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల, అంతకు ముందు తెనాలి, తిరుపతి, కుప్పం వంటి చోట్ల జరిగిన సీఎం సభల నుంచి... జనం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. సీఎం, మంత్రుల సభలు మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ప్రాణసంకటంగా మారాయి. కార్యక్రమం ఏదైనా జనసమీకరణకు అధికారులకు మొదట కనిపించేది డ్వాక్రా మహిళలే. వారి మెడపై కత్తిపెట్టి బెదిరించి మరీ సభలకు తరలిస్తున్నారు. తప్పనిసరై వెళుతున్న మహిళలు... హాజరు వేయించుకుని, ఆ తర్వాత బతుకుజీవుడా అని అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు.

పది రోజుల ముందే టార్గెట్.. సాక్షాత్తు ముఖ్యమంత్రి సభల నుంచే ప్రజలు పరుగు అందుకోవడం విశేషం. ముఖ్యమంత్రి సభలకు అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి 10రోజుల ముందు నుంచే టార్గెట్లు పెట్టి మరీ జనాన్ని తరలిస్తున్నారు. జనం మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా... సభ మొదలైన కాసేపటికే తిరుగుముఖం పడుతున్నారు. సభకు వచ్చామా... అధికారులకు కనిపించామా... హాజరు పడిందా? అని చూసుకుని బయటకు పరుగులు తీస్తున్నారు. ఏడాది క్రితం తిరుపతి ఎస్వీ వర్సిటీ మైదానంలో విద్యాదీవెన కార్యక్రమం నిర్వహించగా... విద్యార్థులు, డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తరలించారు. సీఎం మాట్లాడుతుండగానే, జనం గోడలు దూకి మరీ పారిపోయారు. కుప్పంలో చేయూత కార్యక్రమంలో సీఎం మాట్లాడుతుండగానే జనం ఇంటిబాట పట్టారు. పోలీసులు గేట్లు మూసివేయడంతో బారికేడ్లు దూకి మరీ వెళ్లిపోయారు. ఇటీవల తెనాలిలోని మార్కెట్‌ యార్డులో జరిగిన సీఎం సభకు భారీగా జనాన్ని తరలించారు. ఎండ వేడి భరించలేక, ఆకలి, దప్పికలకు తాళలేక జనం... బారికేడ్ల నుంచి దూకి, కంప చెట్లు దాటుకుని, గోడలు దూకి పారిపోయారు. వారిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. దెందులూరు, గణపవరం, ఏలూరులో జరిగిన సీఎం సభల నుంచీ జనం మధ్యలోనే వెళ్లిపోయారు.

మంత్రులదీ అదే పరిస్థితి.. ముఖ్యమంత్రి సభల నుంచే కాదు... మంత్రుల సభల నుంచీ జనం పారిపోతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సభ ఎక్కడ నిర్వహించినా ప్రజలు మధ్యలోనే వెళ్లిపోయారు. శ్రీకాకుళం టౌన్‌హాలులో జనం ఎవరూ బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారు. ధర్మాన ప్రసగింస్తుండగా ఒకతను గేటు తెరవబోగా... ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి కూడా తరుచూ ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. డోన్‌లో నిర్వహించిన ‘ఆసరా’ కార్యక్రమంలో బుగ్గన మాట్లాడక ముందే డ్వాక్రా మహిళలు తిరుగుముఖం పట్టగా... వైఎస్సార్సీపీ కార్యకర్తలు గేట్లు వేసేశారు. వారితో మహిళలు వాగ్వాదానికి దిగారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో మంత్రి నాగార్జున పాల్గొన్న సభ నుంచి, అమలాపురంలోని మంత్రి విశ్వరూప్‌ పాల్గొన్న సభ నుంచి కూడా జనం మధ్యలోనే వెళ్లిపోయారు.

టార్గెట్లు పెట్టి.. డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను అధికారులు బెదిరించి సభలకు తీసుకురావడం వల్లే వారు మధ్యలో వెళ్లిపోతున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా టార్గెట్‌లు పెట్టి... సీఎం సభలకు రాకపోతే జరిమానా వేస్తామని కూడా కొన్ని చోట్ల బెదిరించి మరీ తరలిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాక.. ముఖ్యమంత్రులు, మంత్రుల సభలకు జనాన్ని తరలించేందుకు ఒక అదనపు వ్యవస్థ ఏర్పాటైంది. తీరా అక్కడికి చేరుకున్న తర్వాత వారి బాధలు ఎవరూ పట్టించుకోకపోవడంతో వారంతా వెనుదిరుగుతున్నారు. జనం బయటకు వెళ్లకుండా అధికారులు, పోలీసులు అడ్డుకోవడం.. చుట్టూ గోడ ఉన్న ప్రాంగణంలో సభ జరిగితే గేట్లకు తాళాలు వేసేస్తున్నారు. అదే బహిరంగ సభ అయితే... బారికేడ్‌లు కట్టి జనాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. పథకాలు రావని బెదిరిస్తేనే సభకు వచ్చామని... లీడర్లకు, రిసోర్స్‌పర్సన్లకు కనిపించామని తిరిగి వెళ్లిపోతుంటే అడ్డుకుంటే ఎలా అంటూ డ్వాక్రా మహిళలు గొడవలు పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details