రాష్ట్రంలోని పలు ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనల వల్ల ప్రముఖ ఆలయాల భద్రతను సమీక్షించుకోవలసిన అవసరం ఏర్పడింది.
కృష్ణా జిల్లాలోనే రెండవ అతిపెద్ద దేవాలయంగా వెలుగొందుతున్న పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో విలువైన రథాలు, ప్రభలు ఉన్నాయి. వీటికి గతంలో ఎటువంటి ముప్పు లేకపోవడంతో... ఆలయ ప్రాంగణంలో ఓ మూలకు ఉంచారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు రథాలు, ప్రభలకు పూజలు చేస్తూ.. టెంకాయలు కొడుతుంటారు. ప్రస్తుతం ఆలయంలో పూర్వకాలంగా ఉన్న 90 అడుగుల ఇనుప ప్రభ ఉంది. అది శిథిలావస్థకు చేరటంతో... దాని స్థానంలో రెండేళ్ల క్రితం 66 అడుగుల ఎత్తుతో కొత్త ప్రభను తయారు చేశారు.
వార్షిక ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహాల ఊరేగింపునకు ప్రత్యేక రథం ఉంది. ఈ ఏడాది దాతల సాయంతో ప్రచార రథం అందుబాటులోకి వచ్చింది. వీటన్నింటిని ఉంచేందుకు ప్రత్యేకమైన స్థలం లేకపోవడంతో ప్రభలను ఆలయం వెనుక భాగాన, ప్రచార రథాన్ని ఆలయం ముందు భాగాన ఉంచుతున్నారు.