అనారోగ్య సమస్యలతో ఓ వృద్ధురాలు రెండు నెలలుపాటు కుమార్తె ఇంటికి వెళ్లింది. ఆ రెండు నెలలు ఆమె వితంతు పింఛన్ తీసుకోలేదు. కుమార్తె ఇంటినుంచి తిరిగి వచ్చిన ఆమె వార్డు వాలంటీర్ను కలిసి తన పింఛన్ గురించి అడగ్గా.. ఆమె ఆవాక్కయ్యే సమాధానం వినాల్సి వచ్చింది. రెండు నెలలుగా నువ్వు కనిపించకపోయేసరికి చనిపోయావనుకున్నానని వార్డు వాలంటీర్ చెప్పాడు.
తాను చనిపోయానని భావించి అధికారులు పింఛన్ ఆపేశారంటూ కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామానికి చెందిన సుందరమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో రెండు నెలల క్రితం కుమార్తె ఇంటికి వెళ్లానని... ఆ తర్వాత తనకు పింఛన్ ఇవ్వలేదని వాపోయింది. వార్డు వాలంటీర్ను అడగ్గా.. రెండు నెలల పెన్షన్ ఇస్తామని చెప్పారంది. అయితే ఆ తర్వాత నెల కూడా పింఛన్ రాలేదని తెలిపింది.