ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛను పథకాలకు పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు. లబ్ధిదారుల సంతృప్తితోపాటు పారదర్శకత కోసం ప్రభుత్వం మంజూరు చేసే అన్ని సామాజిక పెన్షన్లకూ ఈ పాస్ పుస్తకాలు ఇస్తారు. 8న వైఎస్ జయంతి పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్... ఇడుపులపాయలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభిస్తారు. 2250 రూపాయల మొత్తాన్ని ఆ రోజు పంపిణీ చేస్తారు.
పింఛన్ లబ్ధిదారులకు పాస్‌పుస్తకం... - ap
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్లకు పాస్‌బుక్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలనెలా లబ్ధిదారులకు ఇచ్చే అంశాన్ని నమోదు చేసి ఇచ్చేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ ప్రయత్నిస్తోంది. మొత్తం 60 లక్షల పైచిలుకు మందికి వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక ను జూలై 8 నుంచి పంపిణీ చేయనున్నారు.
ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు పింఛన్లతోపాటు దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, మత్స్యకారులు, గీతకార్మికులు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు, ట్రాన్స్ జెండర్లు ఇతర వృత్తి కళాకారులకు సామాజిక పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇక నుంచి లబ్ధిదారులకు తెలిసేలా పాస్ బుక్ ఈ నెల నుంచి ఇస్తారు. పారదర్శత కోసం లబ్ధిదారుల సంతకంతోపాటు ఇచ్చిన వారి సంతకం, ప్రభుత్వ రికార్డు కోసం బయోమెట్రిక్ తీసుకుంటారు. ఈ పాస్ పుస్తకంపై ముఖ్యమంత్రి జగన్ ఛాయాచిత్రం, రాష్ట్ర అధికారిక చిహ్నం, వైఎస్ ఫోటో ఉంటుంది.
వెనుకబాగంలో పింఛను లబ్ధికి సంబధించిన ప్రభుత్వ సమాచారం ముద్రించారు. ప్రస్తుతం 53 లక్షల 93 వేల 217 మంది లబ్ధిదారులు ఉన్నారు. గిరిజన మహిళలకు వయోపరిమితి తగ్గింపు, థలసేమియా, పక్షవాతం, కుష్టు రోగులకు పింఛను ఇవ్వాలన్న నిర్ణయంతో ఈ సంఖ్య మరో పదిలక్షల మేర పెరిగొచ్చని అధికారుల అంచనా.