మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి.. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడలో ఓ థియేటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులను అడ్డుకునేందుకు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు యత్నించారు. జై పవన్ కల్యాణ్, ప్రభుత్వ మొండివైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. మంత్రులను అడ్డుకునేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టైన వారిలో గుడివాడ జనసేన ఇన్‌ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్‌తో పాటుగా పలువురు అభిమానులు ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కల్యాణ్ సినిమాను కక్షపూరితంగా అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్ట్ చేయడం దారుణమని పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడ్డారు.