కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలోని పోలింగ్ సామాగ్రిని ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి.. సిబ్బందికి పంపిణీ చేశారు. స్థానిక స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులు, పత్రాలను అధికారుల సమక్షంలో బయటకు తీసి వాటిని పోలింగ్ బూతులు వారిగా పోలింగ్ అధికారులు అప్పగించారు. నందిగామ నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉండగా.. 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 35231 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల సామాగ్రి పంపిణీ పేరును నగర పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఈటీవీ భారత్తో మాట్లాడుతూ నందిగామ నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు అన్ని పూర్తిచేశామని తెలిపారు. 40 పోలింగ్ కేంద్రాలు 35 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. వీడియో గ్రాఫర్, మైక్రో అబ్జర్వర్ పరిచయం చేస్తారని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు.