కృష్ణా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంక్షలు సడలించిన తరవాత వైరస్ మరింతగా విస్తరిస్తోందని అధికారులంటున్నారు. ఈ పరిస్థితి ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్యసిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల కేవలం కొవిడ్ సేవలకు వినియోగించుకునేందుకు పలు ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈ సేవలతోపాటు జిల్లాలోని ఆయా పీహెచ్‌సీల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయడానికి అధికార యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది.
భర్తీకి ఏర్పాట్లు
జిల్లావ్యాప్తంగా ఉన్న 88 పీహెచ్‌సీల్లో వైద్యులు తగినంత మంది ఉన్నా.. సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆయా గ్రామాలకు కేటాయించిన ఏఎన్‌ఎంలు కొవిడ్ సర్వే తదితర విధుల్లో ఉండటంతో పలు చోట్ల వారి ఆవశ్యకత ఏర్పడింది. పరీక్షలు చేయటానికి ల్యాబ్ టెక్నీషియన్‌లు, మందులు పంపిణీ చేయటానికి ఫార్మసిస్ట్‌లు తదితర విభాగాల సిబ్బంది అవసరం ఏర్పడింది.
రేడియోగ్రాఫర్లు, వివిధ విభాగాల సహాయకుల పోస్టులు కూడా భర్తీ చేయటానికి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేయటంతో పాటు అదనంగా మరిన్ని పోస్టులు మంజూరు చేసింది. ఒప్పంద, పొరుగుసేవల ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.