ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏ నోటా విన్న అదే మాట... అందరిలోనూ ఒకటే భయం.... - స్థానిక ఎన్నికల్లో నోటా భయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుదామని ఉవ్విలూరుతున్న ఔత్సాహికులకు నోటా భయం పట్టుకుంది. అసలే స్వల్ప తేడాతోనే గెలుపొటములు నిర్ణయమయ్యే పంచాయతీ ఎన్నికల్లో ఈ నోటా ఎలాంటి ప్రభావం చూపుతుందోని ఆందోళన చెందుతున్నారు.

ఏ నోటా విన్న అదే మాట... అందరిలోనూ ఒకటే భయం....

By

Published : Jun 27, 2019, 1:11 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో ఓటర్ల జాబితా, కులాల వారీగా గణన సైతం పూర్తవుతోంది. ఈ క్రమంలోనే తర్వలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ‘నోటా’కు చోటు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇటీవల తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నోటా వినియోగించారు. దీంతో ఇక్కడ అమలు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పల్లెపోరులో గెలుపోటములు కేవలం స్వల్పతేడాలతో ఉండటంతో ఈ మార్పు కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే నోటాపై ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నోటాకు ఓట్లు గణనీయంగా పెరిగాయి. కృష్ణా జిల్లాలోని పదహారు, గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో చైతన్యవంతంగా వ్యవహరించారు. అభ్యర్థుల పనితీరు, వ్యవహార శైలిని పరిగణనలోకి తీసుకున్న కొందరు ఓటర్లు నోటాకు జైకొట్టినట్టు తేటతెల్లమైంది. అందుకే నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయని భావిస్తున్నారు.

ఓటర్లు ఇలా.! :

తాజా ఓటర్ల జాబితా ప్రకారం కృష్ణా జిల్లాలోని 980 గ్రామ పంచాయతీల్లో 23,41,337 మంది ఓటర్లున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను నిర్ధరిస్తూ తుది జాబితాను జూన్‌ 18వ తేదీన ప్రచురించారు. ఈసారి 9,990 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మొత్తం 10,548 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ముందస్తు ప్రధాన ప్రక్రియ పూర్తవుతుంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం అవసరమైన అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని బాధ్యులను ఆదేశిస్తూ జిల్లా పంచాయతీ అధికారి జారీ చేశారు.

గణనీయమైన వ్యత్యాసం :

పంచాయతీ పోరులో నోటాను వినియోగిస్తే అభ్యర్థుల తలరాతలు మారుతాయని కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చక.. ఓటు వేయకపోవడం సర్వసాధారణంగా ఉంది. ఇప్పుడు నోటా అమలులోకి రావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు నోటాకు ఓటు వేస్తారు. పంచాయతీ పోరులో అభ్యర్థుల గెలుపోటముల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. మరి నోటాకు చోటు కల్పిస్తే కొందరు అభ్యర్థుల ఫలితం తారుమారయ్యే అవకాశాలుంటాయి.

ABOUT THE AUTHOR

...view details