సాగులో పెట్టుబడి నిమిత్తం అన్నదాతలు సహకార సంఘాలు, కేడీసీసీబీ బ్రాంచిలు, వాణిజ్య బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఉన్న భూమిని బట్టి వారికి అవసరమైనంత మేరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారికి సున్నా వడ్డీ పథకం వర్తిస్తుంది. 7 శాతం వడ్డీ చెల్లిస్తే కేంద్రం 3, రాష్ట్ర ప్రభుత్వం 4శాతం చొప్పున రాయితీ ఇస్తుంది. తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ బ్యాంకులకు చెల్లించేస్తుండగా తరువాత ప్రభుత్వం ఆ మొత్తాన్ని విడుదల చేస్తుంది.
ఇందులో భాగంగానే ఇటీవల 2019-20 రబీ పంటలకు సంబంధించి 56,533 మందికి రూ.15.16 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. దీనిలో అర్హత ఉన్నా చాలామందికి రాయితీ వర్తించలేదని వాపోతున్నారు. ఈ తరుణంలో ఆ సంవత్సరం ఖరీఫ్ పంట రుణాల వడ్డీ రాయితీ నిధులు ఇప్పటికీ జమ కాలేదంటూ రైతులు వాపోతున్నారు. సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకే ఈ సమస్య ఏర్పడిందని, అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఇవీ సమస్యలు
సహకార సంఘాల ద్వారా తీసుకున్న పంట రుణాల వడ్డీ గత ప్రభుత్వ హయాంలో సంఘాలే చెల్లించేవి. రైతు నుంచి వడ్డీ వసూలు చేయకుండా ఒక్కో సంఘంలో ఎంతమంది రుణాల తీసుకున్నారో వారు చెల్లించాల్సిన వడ్డీ సంఘాలే బ్యాంకుకు చెల్లించి ప్రభుత్వం విడుదల చేసిన తరువాత సర్దుబాటు చేసుకునే వారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలకే జమ చేస్తామని చెప్పడంతో సంఘాలు రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఆ రాయితీ జమకావడం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఇటీవల విడుదల చేసిన రబీ పంట రుణాలకు సంబంధించి రాయితీ ప్రభుత్వం విడుదల చేయగా కేడీసీసీ బ్యాంకు పరిధిలోని ఆయా సహకారసంఘాలకు చెందిన 46,476మందికి రూ.11.17కోట్లు విడుదల చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సంగతేంటని అడుగుతున్నారు. గూడూరు మండలం మల్లవోలు సహకారసంఘ పరిధిలో 500 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. వాణిజ్యబ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ జమఅయినా సహకారబ్యాంకు పరిధిలోని కాలేదని చెబుతున్నారు.