New Online Registration Problems in AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తోన్న నూతన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం వినియోగదారుల్ని గందరగోళానికి గురి చేస్తోంది. గతంలో వందల సంఖ్యలో జరిగే రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సర్వర్ సమస్యలతో పాటు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు వాపోతున్నారు. ఆన్‌లైన్ విధానం కాకుండా పాత విధానాన్నే కొనసాగించి.. తాము రోడ్డున పడకుండా చూడాలని డాక్యుమెంట్ రైటర్లు ఆవేదన చెందుతున్నారు.
Problems in Registration Process : ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ విధానంలో ఆస్తి కొనుగోలు చేస్తున్న వ్యక్తి.. ఆన్‌లైన్‌లోనే రెండు పార్టీల వివరాలు, ఆస్తి వివరాలు పొందుపర్చాలి. వాటి ఆధారంగా జనరేట్ అయ్యే మార్కెట్ విలువ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని రెండు పార్టీలుసబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళ్లాలి. కార్యాలయంలోకి వెళ్లే వరకు రెండు పార్టీలు.. డాక్యుమెంట్లపై సంతకాలు చేసే అవకాశం లేదు. ఈ విధానంలో సాక్షి సంతకాలకు అవకాశం లేదు. ఎవిడెన్సు చట్టం ప్రకారం ప్రతీ రిజిస్ట్రేషన్‌కు ఇద్దరు సాక్షులు ఉండాలి. కావున ఫిజికల్ డాక్యుమెంటుపై రెండు సాక్షి సంతకాలు ఉంటాయి. జిరాక్సు రిజిస్ట్రేషన్ విధానంలో ఈ భరోసా లేదు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం నివారించడానికంటూ తెచ్చిన కొత్త విధానం లోపభూయిష్టంగా ఉందని డాక్యుమెంట్ రైటర్లు ఆవేదన చెందుతున్నారు.