ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

krishna water: 'కృష్ణా జలాల్లో చెరి సగం వాటా.. అర్థరహితం'

తెలుగు రాష్ట్రాల మధ్య.. కృష్ణా జలాల నీటిని సమానంగా ఇవ్వడం సాధ్యం కాదని నవ్యాంధ్ర విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్‌ సీఎంకు లేఖ రాశారు. చెరి సగం చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ అర్థరహితమని అందులో పేర్కొన్నారు.

Navyandhra Retired Engineers Association‌ wrote   letter to cm jagan
కృష్ణా జలాల పంపకాలు

By

Published : Jul 31, 2021, 10:50 AM IST

తెలుగు రాష్ట్రాల మధ్య.. కృష్ణా జలాల నీటిని సమానంగా ఇవ్వడం సాధ్యం కాదని నవ్యాంధ్ర విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్‌ సీఎంకు లేఖ రాశారు. జలవనరులకు సంబంధించి బోర్డు నోటిఫికేషన్‌లు, తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అసోసియేషన్‌ శుక్రవారం లేఖ రాసింది. సంఘం అధ్యక్షుడు విశ్వేశ్వరరావు సంబంధిత లేఖను పత్రికలకు విడుదల చేశారు. అందులోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య కృష్ణా నీటిని 50:50 నిష్పత్తిలో పంచాలనే తెలంగాణ డిమాండ్‌ అర్థరహితం, అసాధ్యం. కృష్ణా మొదటి ట్రైబ్యునల్‌ నిర్ణయాలను మార్చడానికి ఏమాత్రం వీలు లేదు. అంతర్రాష్ట్ర వివాద చట్టం సెక్షన్‌4 (1) ప్రకారం పాత ట్రైబ్యునల్‌ నిర్ణయాలకు రక్షణ ఉంటుంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ నిర్ణయాలను పునః సమీక్షించడం కుదరదు’’

-నవ్యాంధ్ర విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్‌

కృష్ణా మొదటి ట్రైబ్యునల్‌ 1960 సెప్టెంబరు నాటికి ఉన్న ప్రాజెక్టుల నీటి కేటాయింపులకు రక్షణ కల్పించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లలో అప్పటికి చిన్ననీటి వనరుల కింద ఉన్న వాడకాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని 1693.36 టీఎంసీలకు రక్షణ కల్పించింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 749.16 టీఎంసీలను ఖరారు చేసింది.

  • నదిలో 75% విశ్వసనీయ జలాలను 2,060 టీఎంసీలుగా లెక్కించి, అందులో అప్పటికే వినియోగంలో ఉన్న 1,693.36 టీఎంసీలను మినహాయించి, మిగిలిన 366.34 టీఎంసీలను మాత్రమే మూడు రాష్ట్రాలకు పంచింది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు కలిపి ఉన్న 811 టీఎంసీల కేటాయింపుల్లో ఏపీ 512, తెలంగాణ 299 టీఎంసీలు ఖరారు చేశారు. గత ఏడేళ్లుగా ఇదే తీరులో రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడు సగం సగం నీరు వాడుకోవాలనే తెలంగాణ డిమాండ్‌ను గట్టిగా ప్రతిఘటించాలి.
  • రాయలసీమకు కృష్ణా నుంచి నీటిని తీసుకువెళ్లడం తప్ప అక్కడ వేరే ఆధారపడతగ్గ జలాలు ఏమీ లేవు. ఈ విషయాన్ని బచావత్‌ ట్రైబ్యునల్‌ పరిశీలించిన తర్వాతే ఇతర బేసిన్లకు మళ్లించేలా నీటి కేటాయింపులు చేసింది. కృష్ణా ట్రైబ్యునల్‌-2 కూడా ఈ కేటాయింపులను కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఒకసారి చేసిన కేటాయింపులను అదే బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వాదన చెల్లదు. తెలంగాణ ఉద్దేశాలు ఏ మాత్రం సరికావు.
  • కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి ప్రధాన ప్రాజెక్టులకే పరిమితం చేయాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల మాత్రమే కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకువచ్చి, జూరాల- కృష్ణా డెల్టాలను పర్యవేక్షిస్తే సరిపోతుంది.
  • నీటి కేటాయింపుల్లో మొదట ఎక్కడైనా తాగునీటి వినియోగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ ప్రాజెక్టు ఆమోదం పొందినా లేకున్నా తొలుత తాగునీటిని ఇవ్వాల్సిందే.
  • ఆరు నెలలలోపు ప్రతిపాదిత ప్రాజెక్టులకు ఆమోదం పొందాలనే నిబంధన సరికాదు.

ఇదీ చూడండి.

GRMB: బోర్డుల పరిధిలో కార్యాచరణకు సై... ఆగస్టు 3న కమిటీ భేటీ

For All Latest Updates

TAGGED:

ts

ABOUT THE AUTHOR

...view details