రాజుల సొమ్ము రాళ్ల పాలు, ఏపీ ప్రజల సొమ్ము సీఎం నీళ్ల పాలు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. సీఎం ఒక్క సమావేశంలో తాగిన వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల ఖరీదు అక్షరాలా 43.44 లక్షల రూపాయలన్న లోకేశ్... ఒక్క రోజులో ఇంత తాగారంటే అది అమృతమైనా అయ్యుండాలి.. లేదా అవినీతైనా చేసుండాలి అని మండిపడ్డారు.
అలాగే ఏడాది క్రితం సీఎం జగన్ ప్రమాణ స్వీకారం రోజున వాటర్ బాటిల్స్, స్నాక్స్‌కి 59.49 లక్షల రూపాయల బిల్లు చేశారని లోకేశ్ అన్నారు. తిన్నవి స్నాక్సా లేక కరెన్సీ నోట్లా ప్రశ్నించారు. దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేయడమంటే ఇదేనని ధ్వజమెత్తారు. వీటికి సంబంధించిన జీవోలను ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.