ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటెత్తిన మునుగోడు..రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదు - మూడంచెల భద్రత

Munugode By Poll Voting Percentage: తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉపఎన్నికలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. మునుపెన్నడూ లేని రీతిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబరిచిన మునుగోడు మహిళలు, యువత.. తమ ఓటుహక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. పలు కేంద్రాల్లో రాత్రి 10.30గంటల వరకు పోలింగ్ జరిగింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 93.13 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.

Munugode By Poll
మునుగోడు ఉపఎన్నిక

By

Published : Nov 4, 2022, 7:42 AM IST

Munugode By Poll Voting Percentage: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపిన మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువత ఓటేసేందుకు ఉత్సాహంచూపారు. వికలాంగులు, జబ్బున పడినవారుసైతం తమ హక్కును వినియోగించుకునేందుకు ముందుకొచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు గంటలకొద్దీ నిరీక్షించి మరీ.. తమ ఎమ్మెల్యే ఎవరో తేల్చేందుకు ఆసక్తి చూపారు. 47 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చే తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 93.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటింగ్​లో మునుగోడు ప్రజలు ప్రజాస్వామ్య పూర్తి కనబరిచారని హర్షం వ్యక్తం చేశారు.

Munugode By Poll Voting : పోలింగ్‌ కేంద్రాల్లో ఏ ఇబ్బంది తలెత్తకుండా యంత్రాంగం నిత్యం పర్యవేక్షించింది. పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వారి కోసం... ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్తగా ప్రతీ కేంద్రంలో వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా సిబ్బంది సకాలంలో స్పందించి సరిచేశారు. చండూరు మండలం కొండాపురంలో ఈవీఎంలో అంతరాయం తలెత్తగా.. 178వ పోలింగ్‌ కేంద్రంలో అరగంటపాటు ఓటర్లు వేచిచూశారు.

చిన్నకొండూరులో వీవీ ప్యాట్‌, “ఎస్.లింగోటం"లో ఈవీఎంలో సాంకేతికలోపం తలెత్తగా సరిదిద్దారు. చౌటుప్పల్‌ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్.. పోలింగ్‌ సరళి, అక్కడ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపఎన్నిక ప్రచారంలో తలెత్తిన ఘర్షణల దృష్ట్యా నియోజకవర్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరించారు.

ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేశారు. నాంపల్లిలో పరిస్థితులను సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ పరిశీలించారు. మునుగోడు, పలివెల, నాంపల్లి కేంద్రాలను పర్యవేక్షించిన నల్గొండ రెమా రాజేశ్వరి.. ఓటర్లతో మాట్లాడుతూ.. పోలింగ్‌ జరుగుతున్న తీరు గురించి తెలుసుకున్నారు. ఉపఎన్నిక పోలింగ్‌వేళ పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మర్రిగూడ మండలంలో సిద్దిపేటకు చెందిన వ్యక్తులున్నారంటూ.. భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

అధికార పార్టీకి చెందిన స్థానికేతరులున్నారంటూ కొందరిని బయటకు లాక్కురావటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లి చండూరు మున్సిపాలిటీ పరిధిలో వాహనాల్లో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలను నల్గొండలోని ఆర్జాలబావి వద్దకు తరలించిన అధికారులు అక్కడ మూడంచెల భద్రత కల్పించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details