ఎస్ఈసీ పరిశీలన
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 37వ డివిజన్లోని గాంధీజీ మునిసిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పరిశీలించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆయనతోపాటే ఉన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన...
నందిగామ నగర పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో పోలింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం 20వ వార్డులో జరుగుతున్న పోలింగ్ వెబ్ కాస్టింగ్ దృశ్యాలను పరిశీలించారు. మరోవైపు నందిగామలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 53.4 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
ఓటుహక్కు వినియోగించుకున్న బుద్ధా, పార్థసారథి
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 38.14శాతం ఓటింగ్ నమోదైంది. 64 డివిజన్ల పరిధిలో మొత్తం 7,81,883 ఓట్లకు గాను 2,98,226ఓట్లు మాత్రమే పోలైనట్లు అధికారులు తెలిపారు. విజయవాడ 38 వ డివిజన్ 10 నంబర్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ ఎనిమిదోవార్డులో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన జనసేన నేత పోతిన మహేశ్
విజయవాడ 53వ డివిజన్ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కును జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ కుటుంబసభ్యులతో కలిసి ఓటును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా మేయర్ అభ్యర్థి
తెదేపా మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయవాడ మూడవ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటేయాలని ఆమె కోరారు.
90ఏళ్ల వృద్దురాలు ఓటు
తిరువూరులో చల్లఅన్నపూర్ణమ్మ అనే 90ఏళ్ల వృద్దురాలు ఓటేశారు. 14వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికొంతమంది వృద్ధులు ఉత్సాహంగా ఎన్నికలలో పాల్గొన్నారు.
తక్కువగానే పోలింగ్
విజయవాడ నగరపాలక ఎన్నికల్లో ఉదయం 11గంటలవరకూ 23.17శాతం ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ మందకొడిగానే సాగుతోంది. మొత్తం 7,81,883 ఓట్లకు గానూ.. 1,81,177ఓట్లు మాత్రమే 64 డివిజన్ల పరిధిలో పోలైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కేశినేని నాని ఓటు
విజయవాడలో కరెన్సీ నగర్లో 3 వ డివిజన్‌లో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటి వరకూ ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు. అధికారులు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఓటేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్
విజయవాడ 24 డివిజన్ శాతవాహన కళాశాలలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు ఓటు
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం క్యూలైన్లలో నిలుచున్నారు. తూర్పు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని .. ఎలాంటి అవాంఛానీయ ఘటనలు లేవని ఆయన అన్నారు. పోలీసులు భద్రత ఏర్పాట్లును పటిష్ఠంగా అమలు చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఓటు
కృష్ణాజిల్లా నందిగామలోని 13వ వార్డులో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఎనిమిది గంటలకి ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత తీవ్రంగా ఉందని.. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
మందకొడిగా పోలింగ్
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1, 2 పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా మొదలైంది. మొదటి ఓటును 60 సంవత్సరాల వృద్ధుడు వినియోగించుకున్నాడు.
ఓటర్లను ప్రభావితం చేస్తున్న అభ్యర్థులు
కృష్ణాజిల్లా నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థులు ప్రభావితం చేస్తున్నారు. పోలింగ్ బూత్ వద్ద తమకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు.
పోలీసుల బందోబస్తు..
కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో అనాసాగరం వద్ద ఓటేసేందుకు క్యూలైన్లలో ఓటర్లు బారులు తీరారు. 35 వేల 231 ఓట్లు ఉండగా.. 20 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 40 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచే అధికారులు పోలింగ్‌ను ప్రారంభించారు. నందిగామ అనాసాగరం హనుమంతు పాలెంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు కేంద్రాల వద్దకు వచ్చారు. నందిగామ డిఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
లిస్ట్‌లో పేరు లేదంటూ ఓటర్ల ఆవేదన
పోలింగ్ అధికారి వద్ద ఓటర్ స్లిప్ ఉన్న జాబితాలో మాత్రం పేరు లేదంటూ పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన విజయవాడ పటమటలో జరిగింది. తమకు ఓటు హక్కు ఉన్న అవకాశం కోల్పోతున్నామని వారు వాపోయారు. తమకు ఓటు హక్కుకు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
విజయవాడలో ప్రశాంతంగా పోలింగ్
విజయవాడలో నగర పాలక ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 64 డివిజన్ల పరిధిలో 347 అభ్యర్థులు బరిలో ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 788 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 7వేల 500 మంది పోలింగ్ సిబ్బంది, ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు 5గురు బృందంగా విధులు నిర్వహిస్తున్నారు.
కార్పొరేషన్ పరిధిలో 325 సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. వైకాపా 64 డివిజన్లు, తెదేపా 57 డివిజన్లలో, సీపీఐ - 6, జనసేన 33, బీఎస్పీ 2, భాజపా 27, సీపీఎం 22, కాంగ్రెస్ 34, ఇతరులు 7, ఇండిపెండెంట్లు 94 చోట్ల పోటీ చేస్తున్నారు. నగరంలో మొత్తం ఓటర్లు 7లక్షల 81వేల 883 మంది కాగా ..మహిళా ఓటర్లు 3 లక్షల 95వేల737 మంది,పురుష ఓటర్లు 3లక్షల 86 వేల23 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
వృద్ధులు, యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. పోలింగ్ కేంద్రాలవద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాలని అధికారులు సూచిస్తున్నారు.
బారులు తీరిన ఓటర్లు..
కృష్ణాజిల్లా తిరువూరు పట్టణంలో ప్రశాంతంగా పురపోరు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తిరువూరు పట్టణంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు
ఓటేసిన వృద్ధులు
కృష్ణాజిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పెడనలో ఉదయం ఏడు గంటలకే అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రారంభమయ్యాయి. వృద్ధులు, దివ్యాంగులతో సహా అందరూ క్యూలైన్లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నందిగామ 13వ వార్డులో 81ఏళ్ల సావిత్రి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే బారులుతీరారు. వృద్ధులు, నడవలేనివారు కూడా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, ప్రాథమిక చికిత్సాకేంద్రాలు ఏర్పాటుచేశారు. శానిటైజర్లుకూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేయకపోవడం కనిపించింది. ఓటర్ల ఫోన్‌లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడంలేదు.
ఉదయం 9 గంటలకు 16.5% పోలింగ్
నందిగామ నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నగర పంచాయతీ పరిధిలో 35 వేల 231 మంది ఓటర్లు ఉండగా 40 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి ఓటేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రం పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఉదయం 8 గంటలకు 7.49 శాతం, ఉదయం 9 గంటల కు 16.5% పోలింగ్ నమోదైంది. నందిగామ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి , తహసీల్దార్ చంద్రశేఖర్, నందిగామ నగర పంచాయతీ కమిషనర్ జయరామ్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఓటేసిన జేసీ కుటుంబ సభ్యులు
విజయవాడ సత్యనారాయణపురంలోని 11వ ఎన్నికల కేంద్రంలో విజయవాడ జాయింట్ కలెక్టర్ మాధవీలత కుటుంబ సభ్యులు ఓటేశారు. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పోలింగ్ కేంద్ర ఏర్పాట్లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ధ్యాన చందర్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో తహసీల్దార్ దుర్గా ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు.
పెడనలో ప్రశాంతంగా ఓటింగ్..
కృష్ణాజిల్లా మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా పెడనలో ఉదయం ఏడు గంటలకే అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రారంభమయ్యాయి. వృద్ధులు దివ్యాంగులతో సహా అందరూ క్యూలైన్లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఇదీ చూడండి.ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్