వైఎస్సార్సీపీలో ప్రాధాన్యం దక్కాలంటే అదే అర్హత - అధిష్ఠానం ఆశీస్సులకూ అదే దగ్గరి దారి! MP Vallabhaneni Balashowry: సన్నిహితులు, కుటుంబ సభ్యుల్లా మెలిగినవారు, వైఎస్‌ఆర్‌కి ఆత్మీయుల్లాంటి నేతలు ఒక్కొక్కరుగా, జగన్ వైఖరిని భరించలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్సార్సీపీని వీడుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనకు టికెట్ విషయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ నుంచి హామీ రాకపోవడం, పార్టీలో సరైన గుర్తింపు లేకపోగా, అవమానిస్తుండటంతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
జగన్‌పై తిరుగుబాటు ప్రకటించిన సన్నిహితుల జాబితాలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి సరసన బాలశౌరి చేరారు. తొలుత వైఎస్ విజయమ్మను కలిసి ఆ తర్వాతే పార్టీని వీడాలనుకున్నారు. శనివారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడంతో రాజీనామా విషయంలో ఆయన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.
YSRCP MP Vallabhaneni Balashauri on MP Ticket మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి మళ్ళీ నేనే పోటీ చేస్తా.. ఎంపీ వల్లభనేని బాలశౌరి
వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తేనే జనసేన తరపున పోటీ విషయంపై స్పష్టత ఇచ్చేందుకు అవకాశం ఉందని పవన్ కల్యాణ్ చెప్పినట్లు సమాచారం. అందుకే బాలశౌరి రాజీనామా నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయంతో జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, గాదె వెంకటేశ్వరరావు గుంటూరులో ఆయన నివాసానికి శనివారం రాత్రి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు వెళ్లినందకేనా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు దిల్లీలో విందు ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తప్ప మిగిలిన వారు ఈ విందుకు హాజరయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం జగన్ బాలశౌరి పట్ల అవమానకరంగా మాట్లాడినట్లు వైఎస్సార్సీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
ప్రజల కంటే అధికార పార్టీ మేలే మాకు ముఖ్యం.. మచిలీపట్నం నగరపాలక సంస్థ వైఖరి
అగ్రనేతలకు ఒక లెక్క ఇతర నేతలకు మరో లెక్కా : సహచర ఎంపీలుగా ఆహ్వానిస్తే వెళ్లామని పైగా అన్ని పార్టీల ఎంపీలు వచ్చారని, తాను వ్యక్తిగతంగా వెళ్లలేదని బాలశౌరి చెప్పేందుకు ప్రయత్నించినా జగన్ వినిపించుకోలేదని సమాచారం. రేవంత్‌రెడ్డి మంత్రివర్గానికి చెందిన మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం విజయవాడకు వస్తే, ఎంపీ మిథున్‌రెడ్డిని ముఖ్యమంత్రి నేరుగా ఆయన వద్దకు పంపి అతిథి మర్యాదలు చేయించారు.
సిట్టింగ్ ఎంపీ బాలశౌరి ఉన్నా ఆయనతో సంబంధం లేకుండా మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి కొత్త సమన్వయకర్తను తీసుకువచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్సీపీని వీడకముందు ఆయన్ను మచిలీపట్నానికి వెళ్లాలని చెప్పారు. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో బాలశౌరి కొంతకాలంగా అసంతృప్తితో పార్టీలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
పేర్ని నానితో.. నా బంధం అదే :కొనకళ్ల
స్థానిక విభేదాలను పట్టించుకోని పార్టీ : పార్టీపై అంసతృప్తితో ఉన్న మచిలీపట్నం ఎంపీగా బాలశౌరికి, స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానికి మధ్య విభేదాలున్నాయి. కమ్యూనిటీ హాలు పనుల పరిశీలనకు ఎంపీ వెళ్లినప్పుడు ఆయన్ను నాని మనుషులు అడ్డుకుని రచ్చ చేశారు. ఎమ్మెల్యే వర్గీయులు ఎంపీపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేశారు. కానీ విభేదాలు వీధికెక్కినా వైఎస్సార్సీపీ అధిష్ఠానం స్పందించలేదు.
చంద్రబాబు పవన్‌లను తిట్టి వీడియోలు సమర్పించాలి : చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ను బూతులు తిట్టాలని, వ్యక్తిగత విమర్శలూ చేయాలని నరసరావుపేట, ఒంగోలు ఎంపీలకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లే బాలశౌరికీ సీఎం జగన్ టార్గెట్ పెట్టారట. అంతేకాక తిట్టిన వీడియోలను ఎప్పటికప్పుడు తన కార్యాలయంలో సమర్పించాలని చెప్పారని తెలిసింది. పైగా ఎప్పుడు ఎక్కడ ఎదురుపడినా ఏంటి నువ్వు ఇంకా తిట్టలేదు అలాంటి వీడియోలేవీ రాలేదని నేరుగా జగనే నిలదీస్తున్నారని తెలిసింది.
ఎంపీ బాలశౌరి ప్రతిపక్ష నేతలను దూషించకపోవడంతోనే జగన్ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎంపీలు తమ నియోజకవర్గాలకు సంబంధించిన పనులను దిల్లీలో తిరిగి చేసుకునే స్వేచ్ఛను వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఇవ్వలేదు. మిథున్‌రెడ్డి లేకుంటే విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో మాత్రమే ఎంపీలు పనిచేసేలా కట్టుబాటు విధించారు.
'బందర్ నీ అడ్డా కాదు..ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా'.. పేర్ని నానికి ఎంపీ బాలశౌరి వార్నింగ్
ఆత్మాభీమానం ఉన్నావారు వైఎస్సార్సీపీ ఉండలేరు : ఎవరైనా కేంద్రమంత్రిని ఎంపీలు కలిస్తే వ్యక్తిగత పనుల కోసం వెళ్లినట్టు అనుమానాస్పదంగా చూస్తూ వారి వ్యక్తిత్వ హననానికీ వెనుకాడని పరిస్థితి ఉంది. నియోజకవర్గాల్లోని సమస్యలపై ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే తన వద్దకు రావాలని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఎంపీలకు జగన్ స్పష్టం చేశారు. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో ఆత్మాభిమానం ఉన్న వారెవరూ వైఎస్సార్సీపీలో ఎంపీలుగా కొనసాగలేరనే స్థాయికి ఆ పార్టీ అధిష్ఠానం తీరు చేరింది.
ఆదిలో వైఎస్సార్సీపీ బలోపేతానికి బాలశౌరి కృషి : జగన్ జైల్లో ఉన్నపుడు, ఆయన పాదయాత్ర సమయంలో పూర్తిగా వెన్నంటి ఉండడమే కాకుండా పార్టీ బలోపేతానికి ఆర్థికంగానూ బాలశౌరి తోడ్పాటునందించారు. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేతగా బాలశౌరిని ఎంపిక చేయాలని మొదట నిర్ణయించారు. కానీ హఠాత్తుగా మిథున్‌రెడ్డిని ఆ పదవిలో నియమించారు. తర్వాత పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం సమయంలోనూ బాలశౌరికి పార్టీ మద్దతు పెద్దగా లభించలేదు.
అధిష్టానంపై అసహనంతోనే బాలశౌరి పార్టీకి రాజీనామా : కేంద్ర మాజీ మంత్రి చిరంజీవితో వ్యక్తిగతంగా తనకున్న సాన్నిహిత్యంతో ఆయనను బాలశౌరి కలిశారు. తర్వాత రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన బాలశౌరి పెద్ద కుమారుడి వివాహానికి సతీసమేతంగా చిరంజీవి హాజరయ్యారు. అక్కడే రెండురోజులు ఉన్నారు. వీటిని రాజకీయ కోణంలో చూసిన జగన్ బాలశౌరిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో విసుగుచెందిన బాలశౌరి వైఎస్సార్సీపీకి రాజీనామా చేసినట్లు తెలిసింది.
వైఎస్సార్సీపీకి మరో షాక్ - పార్టీకి మచిలీపట్నం ఎంపీ రాజీనామా