కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, తెదేపా నేత దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. మైలవరంలో ఇసుక, మట్టి ఖాళీ స్థలాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని దేవిని చేస్తున్న నిరాధార ఆరోపణలు.. నిగ్గు తేల్చేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధిని వదిలి.. దొంగదారుల్లో అక్రమంగా సంపాదించిన దేవినేని ప్రజాతీర్పులో కొట్టుకుపోయారని ధ్వజమెత్తారు. అందువల్లే నేడు కడుపు మంటతో, పనికిరాని... పసలేని ఆరోపణలతో ఉనికిని కాపాడుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని వారికి పంపిణీ చేసేందుకు 650 ఎకరాల భూమిని సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ తెలిపారు. ఇందులో 500 ఎకరాల భూమిని నిర్దేశించిన మార్కెట్ ధరకు కొనుగోలు చేసి... స్థలం ఇచ్చిన రైతుల ఖాతాలో నగదు జమ చేసి తమ పారదర్శకత నిరూపించుకున్నామన్నారు. పని లేక మట్టి కుంభకోణం చేశారుంటూ మాయమాటలు చెప్పి దేవినేని పబ్బం గడుపుతున్నాని ఎద్దేవా చేశారు. కొండపల్లి, జి.కొండూరులో అక్రమ తవ్వకాలు అంటూ సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఉమామహేశ్వరరావు.. తన హయాంలో జరిగిన తవ్వకాల గురించి మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తన ఆరోపణలు నిజమని దేవినేని ఉమా నమ్మితే, మైలవరం నడిబొడ్డున మీడియా సాక్షిగా బహిరంగ చర్చకు తాను సిద్ధమనీ.. దమ్ముంటే వచ్చి సత్య శీలత నిరూపించుకోవాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
ఉనికిని కాపాడుకునేందుకే ఆరోపణలు: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ - mla vasantha krishna prasad challenge
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. సత్య శీలత ఉంటే ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సవాల్