Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ప్రజల నుంచి చెత్త పన్ను కింద నెలకు రూ.90 వసూలు చేయొద్దని ఎమ్మెల్యే కొడాలి నాని పురపాలక అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. చెత్త పన్ను చెల్లింపు భారంగా ఉందని, అద్దెకు ఉంటున్నవారు చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని నాని దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ సహాయ కమిషనరును (ఏసీ) పిలిచి చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పాను కదా మళ్లీ ఎందుకు చేస్తున్నారని అడిగారు. చెత్త పన్ను వసూళ్లలో గుడివాడ రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉందని ఏసీ బదులివ్వగా నెలకు ఎంత వసూలు చేస్తున్నారని నాని అడిగారు. సుమారుగా రూ. 16లక్షలు లక్ష్యంకాగా రూ.14 లక్షలు వసూలవుతోందని ఏసీ బదులిచ్చారు.