గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో మిర్చి రైతులు రెండోరోజూ ఆందోళన నిర్వహించారు. శీతల గిడ్డంగిని సక్రమంగా నిర్వహించకపోవటంతో మిరపకాయలు పాడయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరంగిపురం మండలంలోని చాలామంది రైతులు మిర్చి పంటను సాగు చేశారు. పంట చేతికొచ్చిన సమయంలో కరోనాతో అమ్మకాలు నిలిచిపోయాయి. చేసేదేమీలేక మండలంలోని వేమవరం, నుదురుపాడు, తాళ్లూరు, అల్లవారిపాలెం, ఫిరంగిపురం తదితర గ్రామ రైతులు ఫిరంగిపురం సమీపంలోని శ్రీ సిరి శ్రీనివాస శీతల గిడ్డంగిలో పంట ఉత్పత్తులను నిల్వ ఉంచారు. అయితే దానిని సక్రమంగా నిర్వహించకపోవటంతో కాయలు పాడైపోయాయని... న్యాయం చేయాలంటూ శ్రీ సిరి శ్రీనివాస శీతల గిడ్డంగి వద్ద ఆదివారం, సోమవారం రైతులు ఆందోళన చేశారు. ఏసీ సక్రమంగా పని చేయకపోవటంతోనే కాయలు బూజు పట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్ట పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళనపై సమాచారం అందుకున్న తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి నష్ట పరిహారం అందేలా చూస్తానని కర్షకులకు ఎమ్మెల్యే శ్రీదేవి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో రైతులు శాంతించారు.