మంత్రులుగా ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
రాష్ట్ర రాజకీయాలకు అడ్డా అయినా కృష్ణా జిల్లాకు మంత్రివర్గంలో జగన్ పెద్దపీఠ వేశారు. జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారితో పాటు సామాజిక సమీకరణాలు లెక్కలను పరిగణనలోనికి తీసుకున్న సీఎం జగన్...ముగ్గురికి అవకాశం కల్పించారు. వీరితో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
వైకాపాను ఘనంగా ఆదరించిన కృష్ణా జిల్లాకు రాష్ట్ర మంత్రి వర్గంలో సముచిత ప్రాధాన్యం దక్కింది. ఏకంగా మూడు మంత్రి పదవులు కేటాయించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, విశాఖపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని)తో పాటు విజయవాడ పశ్చిమ నుంచి గెలుపొందిన వెలంపల్లి శ్రీనివాస్‌లతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
విధేయతో....సమతూకం
పార్టీకి విధేయతోపాటు సామాజిక సమీకరణల్లో సమతూకం పాటిస్తూ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించారు సీఎం జగన్. తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన కొడాలి నాని పార్టీలో దూకుడూగా వ్యవహరించారనే పేరుంది. వైఎస్ జగన్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న నేతగా నానికి గుర్తింపు ఉంది. తెదేపా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని...జగన్‌తో ఉన్న సానిహిత్యంతో వైకాపాలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో, శాసనసభలోనూ చురుకుగా వ్యవహారించారు. దీనికి తోడు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు.