భూములు రీసర్వే కార్యశాలను రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 17,640 గ్రామాల్లో రీసర్వే చేస్తామని ఆయన పేర్కొన్నారు. రీసర్వే ప్రక్రియలో 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రీసర్వే చేయాల్సి ఉందన్నారు. 2023 ఆగస్టు నాటికి రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. 100 ఏళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో రీసర్వే కార్యక్రమం జరుగుతుందని అన్నారు.
బ్రిటీషు కాలం నాటి భూరికార్డులు, సర్వేలు, చట్టాల ప్రక్షాళనకై భూములు రీసర్వే చేస్తున్నామని ఆయన తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భూముల రీసర్వే చేస్తున్నామన్నారు. ఇళ్లు, ఆస్తుల సర్వే కూడా జరుగుతుందన్నారు. భూ హద్దులు నిర్ణయించి యజమానికి ల్యాండ్ టైటిల్ అందిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో భూతగాదాలు లేకుండా చేయాలన్నదే మా ఉద్దేశమని అన్నారు. గతంలో భూ భారతి పేరుతో చేసిన రీ సర్వే సఫలం కాలేదని గుర్తు చేశారు. సర్వే ఆఫ్ ఇండియాతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.