"మీ నిర్ణయాలతో... అంధకారంలో రాష్ట్ర భవిష్యత్తు"
ఏపీలో ఆరోగ్య వ్యవస్థ పట్టాలు తప్పుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఆరోగ్య సంరక్షణలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ గత ప్రభుత్వ నివేదికను బయట పెట్టిందనే సంగతి గ్రహించాలన్నారు. "జగన్.. మీ నిర్ణయాలతో రాష్ట్రం అంధకారంలోకి వెళుతుంది" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించలేదని ప్రజల్ని మభ్య పెట్టడానికి జగన్ అనేక గాలి మాటలు మాట్లాడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఏపీలో ఆరోగ్య వ్యవస్థ పట్టాలు తప్పిందని, గాడిన పెట్టడానికి జగన్ దేవుడిలా దిగొచ్చానన్నట్టుగా చేసిన ట్వీట్‌ను లోకేష్ ప్రస్తావించారు. ఆరోగ్య సంరక్షణలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ గత ప్రభుత్వ నివేదికను బయట పెట్టిందనే సంగతి గ్రహించాలని హితవు పలికారు. గత ఐదేళ్ళలో అన్ని వ్యవస్థలూ పట్టాలమీదనే పరుగులు పెట్టాయని గుర్తు చేశారు. జగన్ తాను వచ్చాక ఏకంగా పట్టాలనే పీకేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రపంచంలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటే, జగన్ తన పిచ్చి నిర్ణయాలతో దాన్ని చెడగొట్టరాదని లోకేష్ హితవు పలికారు. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టకండని కోరారు. తాను పట్టిన కుందేలుకి ఒకటే కాలు అనే ధోరణి వదలాలని దుయ్యబట్టారు. పీపీఏలపై ఇంధన శాఖ కార్యదర్శి, కేంద్ర మంత్రి లేఖలు రాసినా వినలేదని, హైకోర్టు సమీక్షలను వాయిదా వేసినా మీరు ఖాతరు చెయ్యకపోవటాన్ని లోకేష్ తప్పుబట్టారు. విద్యుత్ పీపీఏలపై సమీక్షలు పెట్టుబడులకు విఘాతమని జపాన్ భారత ప్రభుత్వానికి లేఖ రాసినందున... ఇప్పుడైనా మీ నిర్ణయం మార్చుకుంటారా అని ప్రశ్నించారు.