ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టీరింగ్ కమిటీ నుంచి వైదొలుగుతున్నాం... 'చలో విజయవాడ'కు పిలుపిస్తాం: ఉపాధ్యాయ సంఘాలు - AP News

Teachers Agitation on PRC: పాఠశాలల్లో నిరసన తెలియజేసే హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్చల్లో ఏకపక్షంగా వెళ్లిన స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన నేతలు... పీఆర్సీ, హెచ్ఆ​ర్ఏ సహా... అన్ని డిమాండ్ల సాధనకు ఐదు రోజులు నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. అవసరం అయితే మరోసారి చలో విజయవాడకు పిలుపునిస్తామని చెప్పారు.

teacher unions resigned the steering committee
teacher unions resigned the steering committee

By

Published : Feb 8, 2022, 9:00 PM IST

Updated : Feb 9, 2022, 5:42 AM IST

Teachers Agitation on PRC: పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీకి రాజీనామా చేస్తున్నామని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) అధ్యక్షుడు సుధీర్‌బాబు, ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్‌) ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌)-1938 అధ్యక్షుడు హృదయరాజు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ కాపాడలేకపోయిందన్నారు. తమ రాజీనామాలను ఐకాస ఛైర్మన్లకు పంపించామని వెల్లడించారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌, ఇతర ప్రయోజనాల సాధనకు పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. విజయవాడలో మంగళవారం వారు విలేకర్ల సమావేశం నిర్వహించారు.

స్టీరింగ్‌ కమిటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఉపాధ్యాయ నేతలు

స్టీరింగ్‌ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మంత్రుల కమిటీతో చర్చలు జరగలేదని, ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, గ్రాట్యుటీ, అదనపు క్వాంటం పింఛన్‌, సీపీఎస్‌ రద్దులాంటి ముఖ్యమైన అంశాలపై సాధన సమితి నాయకత్వం పట్టుబట్టలేదని ఆరోపించారు. ముఖ్యమైన అంశాలలో స్పష్టమైన నిర్ణయాలు రాబట్టలేకపోయామని తెలిపారు. ‘చలో విజయవాడ’ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు విజయవంతం చేశారని, సాధన సమితి నేతలు మాత్రం నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి, ప్రభుత్వం వద్ద అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. మంత్రుల కమిటీ చర్చలకు హాజరైనట్లు సంతకాలు చేసిన కాగితాన్ని చూపించి, ఒప్పందాన్ని అంగీకరించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సరికాదన్నారు. ఇది ప్రభుత్వ విశ్వసనీయతకే నష్టమని వెల్లడించారు. కలిసొచ్చే సంఘాలతో పీఆర్సీపై ప్రత్యేక ఉద్యమం చేపట్టనున్నామని చెప్పారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం, ఇతర సంఘాల వారు ఇప్పటికే మద్దతు తెలిపారని గుర్తు చేశారు.

ఫిట్‌మెంట్‌ను సాధన సమితి పట్టించుకోలేదు

‘ఫిట్‌మెంట్‌ అంశాన్ని పీఆర్సీ సాధన సమితి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సాధన సమితి స్టీరింగ్‌ కమిటీకి రాజీనామా చేస్తున్నాం. ఐకాస ఛైర్మన్లకు లేఖలు పంపించాం. పీఆర్సీపై ప్రత్యేక ఉద్యమం చేపట్టనున్నాం. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో కలిసొచ్చే సంఘాలతో 12న రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నాం. ఫిట్‌మెంట్‌ 27శాతం పైన ఉండాలని అడిగితే మంత్రుల కమిటీ ముగిసిన అధ్యయనం అని చెప్పింది. దీన్ని చర్చల్లో వ్యతిరేకించాం. మెజారిటీ సభ్యుల అంగీకరించారంటూ సాధన సమితి నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లబోయే ముందు మా అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాం. పీఆర్సీ ఉత్తర్వులతోపాటు మిశ్ర నివేదిక ఇస్తామని మంత్రుల కమిటీ చెప్పడంతో చర్చల్లో పాల్గొన్నాం. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులపై పట్టుబట్టాం. సీలింగ్‌ వద్దన్నాం. సీలింగ్‌ వెయ్యికి పెంచడానికి రెండు గంటలకుపైగా చర్చలు సాగాయి. చర్చల సమయంలో ఎక్కడా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సంతకాలు చేయలేదు. ఒప్పందాల సమయంలో బయటకు వచ్చేశాం’.- ఎస్టీయూ అధ్యక్షుడు సుధీర్‌బాబు

కోరుకున్న ప్రయోజనాలు దక్కలేదు

‘95శాతం మంది ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. పీఆర్సీ సాధన సమితికి రాజీనామా చేశాం. ప్రత్యేక ఐక్య ఉద్యమం చేస్తాం. గతంలో ఫ్యాప్టో ఆందోళనలతో ఉద్యమాన్ని నిలబెట్టాం. ఆ తర్వాతే నాలుగు ఐకాసలు ఒక్కటయ్యాయి. సీఎం వద్ద ఫిట్‌మెంట్‌ను అడుగుతామన్నా కుదరదని మంత్రుల కమిటీ చెప్పింది. ఐఆర్‌ 27శాతానికి తగ్గకుండా తెలంగాణలో ఇచ్చినట్లు 30శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరినా అంగీకరించలేదు. సాధన సమితిలో ఏకాభిప్రాయం రాకపోయినా సమ్మెను విరమించారు. ఈనెల 6న సీఎం వద్దకు వెళ్లేందుకు రావాలని సాధన సమితి నేతలు పిలిచినా వెళ్లలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని సీఎం వద్ద ప్రస్తావించాలని చెప్పాం. కానీ, ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం మంచి ప్రయోజనాలు కల్పించారని సాధన సమితి నేతలు ప్రకటించారు’. - యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌

వివరాలు సేకరించడాన్ని ఖండిస్తున్నాం:‘ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న వారి వివరాలను సేకరించడంతోపాటు పోలీసుస్టేషన్లకు రప్పించి విచారించడాన్ని ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ అన్నారు.

హక్కుల కోసం చివరి దశ ఉద్యమం: హృదయరాజు
‘పీఆర్సీ ప్రయోజనాలను ఇప్పుడు కోల్పోతున్నాం. గతంలో సాధించుకున్న వాటిని వదులుకునేందుకు సిద్ధంగా లేము. హక్కులను కాపాడుకునేందుకు చివరి దశ పోరాటం చేపట్టాం. కలిసొచ్చే సంఘాలతో ఉద్యమానికి వెళ్తాం. సీపీఎస్‌ రద్దు చేయకుండా రోడ్‌ మ్యాప్‌ అంటున్నారు. వారంలో రద్దు చేస్తామన్నా హామీ ఏమైంది? ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు వేతనాలు పెంచాలి. 23శాతం పెంచితే వాళ్లు ఎలా ఐదేళ్లు బతుకుతారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు నుంచి ప్రొబేషన్‌ ఖరారు చేయాలి. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే పదవీవిరమణ వయస్సు 62ఏళ్లకు పెంచమని ఎవరు అడిగారు’ అని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు హృదయరాజు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Ashok Babu: జగన్ మోసానికి ఉద్యోగుల రిటర్న్ గిఫ్ట్ ఖాయం: అశోక్​బాబు

Last Updated : Feb 9, 2022, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details