కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే 29.6 ఎకరాలను ప్రభుత్వం ముందస్తుగా స్వాధీనం చేసుకుంది. బందరులోని వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన భూమిని వైద్యకళాశాలకు బదలాయిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు రెవెన్యూ శాఖ పరిశీలిస్తోంది. గత ఏడాది ఏపీఎంఎస్‌ఐడీసీ నాలుగు వైద్య కళాశాలలకు టెండర్లను పిలిచింది. వీటిని ఇంకా ఖరారు చేయలేదు. వాటిలో మచిలీపట్నం వైద్య కళాశాల భవనాల నిర్మాణం కూడా ఉంది. వైద్య కళాశాల ఏర్పాటకు 100 ఎకరాల వరకు కావాలని ప్రాథమికంగా నివేదించినట్లు తెలిసింది. అంత అవసరం ఉండదని రెవెన్యూ శాఖ వాదిస్తోంది. ప్రస్తుతం మనుగడలో ఉన్న జిల్లా ఆసుపత్రికి విస్తీర్ణం తక్కువగా ఉంది. జిల్లా ఆసుపత్రి నగరం మధ్యలో ఉంది. ఇక్కడ 450 పడకల ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలోనే నర్సింగ్ కళాశాలను నిర్వహిస్తున్నారు. వైద్య కళాశాలతో పాటు అదనంగా క్యాన్సర్ విభాగాన్ని నిర్మించాల్సి ఉంది. నర్సింగ్ కళాశాలకు వసతి గృహం ఇతర శాశ్వత భవనాలకు రైల్వేస్టేషన్ సమీపంలో భూములను పరిశీలించినట్లు తెలిసింది. అవి ఇంకా ఖరారు కాలేదు.
వైద్యకళాశాలకు ప్రస్తుతం 29.60 ఎకరాలను వ్యవసాయక్షేత్రానికి చెందిన భూమి కేటాయించారు. అక్కడి నుంచి వ్యవసాయ క్షేత్రం ఇతర ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. ఈ భూమితో పాటు మరో 40 నుంచి 50 ఎకరాల వరకు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల భూసేకరణకు సంబంధించి మంత్రి పేర్ని వెంకట్రామయ్య అధికారులతో సమీక్షించారు. మరోవైపు శివారులో రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.. కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి కోసం 20 ఎకరాల వరకు కావాల్సి ఉందని ప్రతిపాదించారు. మొదట వ్యవసాయ పరిశోధన కేంద్రం భూములు ఇచ్చేందుకు ఆ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చౌడు భూములపై ఇక్కడ పరిశోధన జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక్కటే పరిశోధన కేంద్రం కావడం విశేషం. దీనిపై మంత్రి వారిని అంగీకరింప చేసినట్లు తెలిసింది. ఇక్కడ వాతావరణ శాఖకు చెందిన రాడార్ ఉంది. వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పట్టించుకోవడం లేదని అంటున్నారు.