ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదేళ్లయినా కృష్ణమ్మ కరకట్టవాసుల్లో వీడని వణుకు - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

వానాకాలంలో కృష్ణమ్మ పరవళ్లు ఎంతో కనువిందు చేస్తాయి. కాని కరకట్ట వాసుల్లో మాత్రం కృష్ణా నదికి వరదొస్తుందంటే వెన్నులో వణుకు పుడుతుంది. 2009లో ఓలేరు వద్ద కట్టకు గండి పడి తీరని నష్టం ఎదురైనప్పుడు, కరకట్ట పటిష్ఠం చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు వాగ్దానం చేశారు. పనులు మొదలైనా పలు కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. పదేళ్లుగా నదీ తీర ప్రాంత వాసులు వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

krishna river problems
పదేళ్లయినా వీడని వణుకు

By

Published : Jun 15, 2020, 10:41 AM IST

పెదపులివర్రు వద్ద కంప చెట్లతో కరకట్ట దుస్థితి

కృష్ణా నదికి 2009 అక్టోబరులో సంభవించిన వరదలతో జిల్లా వాసులకు తీరని నష్టం ఎదురైంది. నాటి వరదల కారణంగా జిల్లాలో మాచర్ల, గురజాల, దాచేపల్లి, మాచవరం, బెల్లంకొండ, అచ్చంపేట, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని 106 గ్రామాల పరిధిలోని 1,60,423 మంది నష్టపోయారు. 1241 గృహాలు పూర్తిగా, 2735 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రైతులు 53 వేల ఎకరాల్లో పంటను నష్టపోయారు. భట్టిప్రోలు మండలం ఓలేరు పల్లెపాలెం వద్ద కరకట్టకు గండి పడటంతో రేపల్లె పట్టణంతో పాటు కారుమూరు, పేటేరు, మోర్లవారిపాలెం తదితర 18 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 273 గృహాలు పూర్తిగా 1647 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రేపల్లె పట్టణం మూడు రోజులు జల దిగ్భందంలో ఉండి ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయింది. ప్రస్తుతం వర్షాకాలంలో కృష్ణా నదికి వరద వచ్చిన ప్రతి సందర్భంలో నాటి నష్టం కరకట్ట వాసుల కళ్ల ముందు మెదలాడుతుంటుంది.

ప్రజల గోడు పట్టేదెవరికీ..

జిల్లా ప్రజాప్రతినిధులు మొరపెట్టుకోవడంతో అప్పట్లో ప్రభుత్వం కృష్ణా కరకట్ట అభివృద్ది ఆవశ్యకతను గుర్తించింది. ప్రకాశం బ్యారేజీ ఉన్న సీతానగరం నుంచి పెనుమూడి వరకూ(57.89 కి.మీ) పొడవునా ఏడు మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డు, అటూ ఇటూ 1.5 మీటర్ల వంతున బరమ్స్‌తో కట్టను పటిష్ఠం చేసి రహదారి నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు.

వరద రాక మునుపు 2008లో రేపల్లె మండలం పెనుమూడి నుంచి అడవిపాలెం(20 కి.మీ) వరకూ గ్రావెల్‌ రహదారి, అక్కడ నుంచి లంకెవానిదిబ్బ వరకూ మట్టితో పటిష్ఠ పరిచేలా రూ.119.6 కోట్లు మంజూరు చేసింది. 2010 సెప్టెంబరు నాటికే పనులు పూర్తి చేయాల్సి ఉంది. వరద తరువాత ఈ పనులు మరింత పకడ్బందీగా చేయాలని నిర్ణయించారు. కాని ఆచరణలో అడుగు ముందుకు పడలేదు.

2010 సంవత్సరంలో పనులు మొదలైనా కరకట్ట విస్తరణకు అవసరమైన భూసేకరణ తదితర కారణాలతో పనులు నత్తనడకన సాగాయి. తరువాత పనులు అంచనాలు పెంచాలని గుత్తేదారు పనులు చేయడానికి ముందుకు రాలేదు. ఫలితంగా అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి.

ప్రస్తుతం చాలాచోట్ల కరకట్ట పగుళ్లిచ్చి బలహీనంగా ఉండటంతో కట్టను ఆనుకొని ఉన్న పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెదపులివర్రు, పెనుమూడి ప్రాంతాల్లో కట్టపై నడిచేందుకు కూడా అవకాశం లేకుండా అధ్వానంగా మారింది. భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని లంక గ్రామాల ప్రజలతో పాటు రేపల్లె వాసులు ఎప్పుడు ముప్పు ఎదురవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కరకట్టను పటిష్ఠం చేయాలని కోరుతున్నారు.

భూ సేకరణ చేపట్టాం

సీతానగరం నుంచి పెనుమూడి వరకు 57.89 కి.మీ కరకట్ట కొంత విస్తరించి బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. విస్తరణ కోసం కొంత భూమిని సేకరించాం. ఇంకా వెల్లటూరు, దోనేపూడి, పెదపులివర్రు, పెనుమూడి ప్రాంతాల్లో సేకరించాల్సి ఉంది. అందువల్ల ఆయా ప్రాంతాల్లో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం 52.4 కిమీ రహదారి పూర్తి చేశాం. పెనుమూడి-లంకెవానిదిబ్బ వరకూ గ్రావెల్‌తో కొంత వరకూ అభివృద్ధి చేశాం. దాన్ని కూడా సింగిల్‌ లైన్‌ బీటీ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.

ఇవీ చూడండి:చైనాలో పెరుగుతున్న కేసులు.. లాక్​డౌన్​లోకి మరో పది ప్రాంతాలు

ABOUT THE AUTHOR

...view details