ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NADENDLA MANOHAR: 'నవరత్నాలు రాలిపోయే స్థితిలో ఉన్నాయ్'

మచిలీపట్నంలో జనసేన కృష్ణా జిల్లా కార్యాలయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రాష్ట్రాన్ని నడపడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నవరత్నాలు రాలిపోయే పరిస్థితికి వచ్చాయని అన్నారు.

NADENDLA MANOHAR
NADENDLA MANOHAR

By

Published : Aug 28, 2021, 8:45 PM IST

రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నా.. సామాన్యుడిని ఆదుకోవడంలో విఫలమైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రజలు ఎన్నడూ లేనంతగా.. వైకాపా ప్రభుత్వానికి భారీ మెజారిటీ కట్టబెడితే.. సక్రమంగా పరిపాలన అందించలేని దుస్థితిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. వైకాపా నేతలు గొప్పగా చెప్పుకుంటున్న నవరత్నాలు.. ఇప్పుడు రాలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని అన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా పత్రాలు, గుర్తింపు కార్డులతో కూడిన కిట్లు అందచేశారు. రైతులకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించలేకపోందని.. రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా మహిళల మీద దాడులు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేనేత కార్మికులకు ఇచ్చే నేతన్న నేస్తం పథకంలో కోత పెట్టడాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 30 వేల మందికిపైగా అర్హులైన చేనేత కార్మికులుంటే.. ప్రభుత్వం కేవలం 75 వేల మందికి సాయం చేసిందని చెప్పారు. మన సంస్కృతికి రూపమైన చేనేతను కాపాడేందుకు ఈ ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఇదేనా..? అంటూ ఆయన ప్రశ్నించారు. మహిళలు రోడ్ల మీదకు వచ్చి తమ పింఛన్లు తీసేశారంటూ.. అర్జీలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదని తెలిపారు. త్వరలో గ్రామాన్ని యూనిట్ గా చేసుకుని ముందుకు వెళ్తామని.. డిసెంబర్ 31 నాటికల్లా మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీ ఏర్పాటును పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details