Pawan On Assembly Attacks : శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరపకుండా విపక్ష సభ్యులపై దాడులు చేయడమేంటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించిన పవన్... శాసనసభలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని పరిరక్షించాలని కోరారు. ప్రజల గొంతు నొక్కే జీవో నంబర్ 1పై చర్చకు అనుమతించకపోవటం దారుణమన్నారు. చర్చకు అనుమతించాలని ఆందోళన చేసిన తెదేపా శాసనసభ్యులపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయ స్వామి, బుచ్చయ్య చౌదరిలపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఆక్షేపించాలన్నారు. పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్నవాటిపై చర్చించటం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. సభలో జరిగిన పరిణామాలు శృతిమించితే వీధుల్లో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ నిర్వహణ అధికారులపైనా ఉందన్నారు.
సీపీఐ ఖండన..అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని సీపీఐ తీవ్రంగా ఖండించింది. జీవో నంబర్ 1 రద్దు కోరితే జగన్ సర్కారుకు ఉలుకెందుకని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.