Impact of Tax and Incidence of Tax: విజయవాడలో సుమారు 12లక్షల 50వేల మంది ప్రజలు లక్షా 92వేల కుటుంబాలు జీవిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే నగర పాలక సంస్థ విధిస్తున్న పన్నులకు సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఉన్నపన్నులనే కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడ్తుంటే.. వీఎంసీ గత నెల నుంచి మరోసారి ఆస్థిపన్నుపెంచింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సతమతమవుతున్న తమపై మరోసారి పన్నుల భారం వేయడమేంటని బెజవాజ ప్రజలు వాపోతున్నారు.
గతంలో.. ఇంటిపన్నులోనే కుళాయి, చెత్తపన్ను కలిపి కట్టేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్తపన్ను, కుళాయి పన్ను వేర్వేరుగా వసూలు చేస్తోంది. ఈ పన్నుల మోతపై నగర వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో చెత్తపన్ను నెలనెలా వసూలు చేయాలని నగరపాలక సంస్థ నిర్ణయించినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆరు నెలలకోసారి ఇంటి పన్నుతో కలిపి వసూలు చేయాలని భావిస్తోంది.
మురికివాడల్లో కుటుంబానికి 30 రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 120 రూపాయల చెత్త పన్నును విధిస్తున్నారు. గత ఏప్రిల్ నెల నుంచి ఇంటి పన్ను మరింత పెంచారు. కరెంట్ ఛార్జీలను సైతం పలు పేర్లతో అధిక మొత్తంలో ప్రభుత్వం వసూలు చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు తోడు ప్రభుత్వం విధిస్తున్న ఈ పన్నులు ప్రజలకు భారంగా మారాయని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఇంటి పన్నును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకపక్క సరైన ఉపాధిలేక అవస్థలు పడుతున్న తమపై నగరపాలక సంస్థ పన్నుల భారం మోపటంసమంజసం కాదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.