కరోనా బాధితులకు అందిస్తున్న చికిత్స,ఏర్పాట్లతో పాటు కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు, ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతోందని ఆరాతీసింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాల్ని వెల్లడించాలని పేర్కొంది.
రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలపైన, మాస్కులు, భౌతిక దూరం, ఆసుపత్రుల్లో పడకలపైన ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుమన్ స్పందిస్తూ.. ఆక్సిజన్ కొరత లేదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవోలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. దీంతో విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.
కరోనా కట్టడి విషయంలో కేంద్రం మార్చి 23న జారీచేసిన మార్గదర్శకాల్ని రాష్ట్రంలో అమలు చేయట్లేదంటూ ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి బి.మోహన్‌రావు హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది పొత్తూరి సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచలేదన్నారు. ఫలితాల వెల్లడిలో తీవ్రజాప్యం జరుగుతోందన్నారు. దాంతో.. రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. రోజుకు 75వేల పరీక్షలు చేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఆక్సిజన్ నిల్వలకు కొరత ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా.. రోజుకు 310 టన్నుల ఆక్సిజన్ ఉందన్నారు. కొరత లేదన్నారు.
మాస్కులు ధరించనివారిపై ఏం చర్యలు తీసుకున్నారు? జరిమానా ఎంత వసూలు చేస్తున్నారని ధర్మాసనం ఆరాతీసింది. రూ.100 జరిమానా వేస్తున్నామని జీపీ బదులిచ్చారు. నిజంగానే చర్యలు తీసుకుంటున్నారా? మార్గదర్శకాలు కాగితాలకే పరిమితమా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హోం ఐసొలేషన్ అవకాశం లేనివారికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేశారా అని ప్రశ్నించింది. ‘కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య పెంచాలి, ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ వ్యాజ్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైనదిగా భావించవద్దు. కరోనాను కట్టడి చేయడానికి వ్యవస్థ లేకపోతే కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది’ అని తెలిపింది.