కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక(high court on kondapally municipal elections) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా విషయంలో రిటర్నింగ్ అధికారి కొండపల్లి మున్సిపల్ కమిషనర్ శివనారాయణరెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. బుధవారం ఉదయం 10:30 గంటలకు సమావేశం నిర్వహించి ఎన్నిక నిర్వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అనుమతివ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు విజయవాడ పోలీసు కమిషనర్ సహకారం తీసుకోవాలని ఆర్వోను ఆదేశించింది. ప్రత్యేక సమావేశ కార్యక్రమం, ఎన్నిక ప్రక్రియను వీడియో తీయించి ఆ వివరాలతో కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆర్వోకు స్పష్టంచేసింది. ఈ ఆదేశాలతో ముచ్చటగా మూడోసారి నేడు కౌన్సిల్ సమావేశం కానుంది.
ఆర్వో తీరుపై న్యాయస్థానం ఆగ్రహం
వైకాపా నేతల వీరంగంతో రెండుసార్లు వాయిదా పడిన కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేడు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈనెల 22 న నిర్వహించాల్సిన ఎన్నికను రిటర్నింగ్ అధికారి రెండుసార్లు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ తెదేపా కౌన్సిలర్లు, ఓ స్వతంత్ర అభ్యర్థి, తెదేపా ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కోరం ఉన్నప్పుడు ఎన్నికను వాయిదా వేయడానికి వీల్లేదని.. వైకాపా కౌన్సిలర్లు అవరోధం కల్పిస్తున్నారనే కారణంతో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేశారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆర్వో శివనారాయణరెడ్డి తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారంనాటి విచారణకు అత్యవసరంగా పిలిపించిన ధర్మాసనం ఆర్వోకు పలు ప్రశ్నలు సంధించింది. అడ్డుకుంటున్నారని ఎన్నిసార్లు ఎన్నికను వాయిదా వేస్తారని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇంకోదానికి అనుమతించబోమని(kondapally municipal elections news) అంటే దానికీ అంగీకరిస్తారా.. అని ఆర్వో పై మండిపడింది.