పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలక్టు కమిటీకి పంపకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనసభ కార్యదర్శి కౌంటర్లు దాఖలు చేయకపోవటంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 'నాలుగు వారాలు గడువు ఇచ్చినా కౌంటర్లు దాఖలు చేయకపోతే ఎలా?... మీ చర్యను నిర్లక్ష్యంగా భావించాల్సి ఉంటుంది' అని పేర్కొంది. పరిస్థితులు మారినందున కౌంటర్లు వేయలేదని, సమగ్ర వివరాలతో దాఖలు చేద్దామనకుంటున్నామని ప్రభుత్వం, శాసనసభ కార్యదర్శి తరపు న్యాయవాదులు చెప్పటం అంగీకారయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. ఇదే అంశానికి సంబంధించిన విషయంలో ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ వేసిన వ్యాజ్యాన్ని ప్రస్తుత వ్యాజ్యంతో కలిపి విచారణ జరుపుతామని బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలక్టు కమిటీకి పంపకపోవడాన్ని సవాలు చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఈ ఏడాది మే 22న హైకోర్టును ఆశ్రయించారు. సెలెక్టు కమిటీకి పంపుతూ మండలి తీసుకున్న నిర్ణయాన్ని నోటిఫై చేసేలా శాసనసభ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. అప్పట్లో విచారణ జరిపిన కోర్టు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనసభ కార్యదర్శి(మండలి కార్యదర్శి ఇంఛార్జి), సహాయ కార్యదర్శి, కార్యదర్శి పి. బాలకృష్ణ మాచార్యులకు నోటీసులు జారీచేసింది. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ .. గడువులోపు ప్రతివాదులు కౌంటర్లు వేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.