విజయవాడ బెంజి సర్కిల్ ప్రాంతం చూసినా, అటునుంచి ఆటోనగర్ వెళ్లినా... లేదా బీఆర్టీఎస్ ప్రాంతాన్ని పరిశీలించినా.. ఏ పనీ లేక ఆహారం దొరక్క అలమటించే కూలీలు కొందరైతే... లాక్డౌన్ నిబంధనలు అమలయ్యేలా క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది మరికొందరు. వీరు పడుతున్న కష్టాలకు తమ వంతు సాయంగా ఎన్నో సంస్థలు చొరవ చూపుతున్నాయి. పేదల ఆకలి తీర్చేందుకు కొందరు తపన పడుతుంటే.... విధులు నిర్వర్తించిన వారికి సాయం చేసి వారిని గౌరవిస్తున్నవారు ఇంకొందరు. నగరంలో పెద్ద పెద్ద సేవా సంస్థలు మొదలుకుని.. సామాన్యుల వరకూ ఎంతోమంది.. మీకు మేమున్నాం అంటూ తోచిన రీతిలో సాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. రోజూ రెండు పూటలా ఆహార పొట్లాలు పంపిణీ చేసేవారు కొందరైతే.. నిరుపేదలకు కావాల్సిన నిత్యావసర సరుకులు, డబ్బులు అందిస్తున్నవారు ఇంకొందరు. యువత ఎక్కడికక్కడ చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి.. వారి సొంత డబ్బుల్ని వెచ్చించి మరీ నిత్యం అనేక మందికి ఆకలి తీరుస్తున్నారు.
నగరంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుని మరీ పోలీసులు... పారిశుద్ధ్య సిబ్బందికి మంచినీరు, మజ్జిగ వంటివి అందించే వారికి సెల్యూట్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా చేసే ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటంతో పాటు జనం భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవటంలో పోలీసులు తమవంతు సాయం అందిస్తున్నారు.