ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషజ్వరాల పంజా.. ఆందోళనలో ప్రజలు.. - ap 2021 news

కృష్ణా జిల్లాలో విష జ్వరాల బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌తో పాటు తాజాగా స్క్రబ్ టైఫస్ జ్వరాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. విష జ్వరాలు సోకిన కొందరిలో టైఫస్ లక్షణాలు కనిపిస్తున్నాయని.... ప్రాథమిక దశలో వ్యాధి లక్షణాలు గుర్తిస్తే ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు.

heavy-dengue-and-tyfus-fever-patients-in-krishna-district
జిల్లాలో విషజ్వరాల పంజా.. ఆందోళనలో ప్రజలు..

By

Published : Oct 3, 2021, 11:38 AM IST

జిల్లాలో విషజ్వరాల పంజా.. ఆందోళనలో ప్రజలు..

డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి విష జ్వరాలతో పాటు స్క్రబ్ టైఫస్ కేసులు రావటం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. ఇది తొలుత అన్ని జ్వరాల్లాగే అనిపించినా ప్రభావం ఎక్కువ రోజులు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. టైఫస్ వ్యాధిని గుర్తించటంలో ఆలస్యం జరుగుతోందని... సకాలంలో సరైన చికిత్స అందకపోతే ప్రాణానికి ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి... టిక్స్ అనే కీటకం కుట్టడం వల్ల... బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు. దీని బారినపడిన వారికి డెంగీ మాదిరిగానే తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.

విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా టైఫస్ వేగంగా విస్తరిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. పొదలు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారిని టైఫస్‌ సోకిన పురుగులు కుడితే, పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయని పేర్కొన్నారు. వ్యాధిని గుర్తించటంలో ఆలస్యమైతే.... మూత్రపిండాలు, కాలేయం, గుండె, మెదడు తదితర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. టైఫస్‌ వ్యాధి నిర్ధారణకు మొదట ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు. అందులో పాజిటివ్‌గా తేలితే... ఎలిసా అనే యాంటీబాడీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ర్యాపిడ్ టెస్ట్ ఆధారంగా మందులు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. కొందరిలో డెంగీ, టైఫస్ జ్వరాలు ఒకేసారి సోకుతున్నాయని తెలిపారు. డెంగీ జ్వరం వస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుందనే భయం అక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు.

విష జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నందున అనారోగ్యం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్

ABOUT THE AUTHOR

...view details