రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడలి విజయవాడ. పండిట్ నెహ్రూ బస్టాండుకు ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు, తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడికి నిత్యం దాదాపు 3,000 బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో 400 వరకు సర్వీసులు తిరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 1.50 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. పండగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇందులో సిటీ బస్ పోర్టు నుంచి దాదాపు 50 వేల నుంచి 75 వరకు ఉంటారు. ఇంత రద్దీగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ఆదాయం కోసం వాణిజ్య దుకాణాలను నిర్మించారు. ఎరైవల్, డిపార్చర్ బ్లాక్‌లతో పాటు సిటీ టెర్మినల్‌లో మొత్తం 140 వరకు ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతం 89 నడుస్తున్నాయి.
* బస్టాండులోని షాపుల్లో చాలా వాటిల్లో ఎమ్మార్పీ నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. నిర్ణీత ధర కన్నా కనీసం రూ. 5 వసూలు చేస్తున్నారు. మంచినీటి సీసాపై ఎమ్మార్పీ రూ. 20 ఉంటే.. దీనిని రూ. 25కు విక్రయిస్తున్నారు. శీతల పానీయాలు, మజ్జిగ, లస్సీ ప్యాకెట్లపైనా ఇదే బాదుడు ఉంటోంది. బయట మజ్జిగ ప్యాకెట్ రూ. 8 తీసుకుంటుంటే.. బస్టాండులో మాత్రం రూ. 12కు అమ్ముతారు. లస్సీ ప్యాకెట్ బయట రూ. 10 విక్రయిస్తుంటే, ఇక్కడ రూ. 15 తీసుకుంటారు. కొన్ని షాపులవారైతే ప్రత్యేక ధరలు ముద్రించుకుని అమ్ముతుంటారు. అన్ బ్రాండెడ్ వస్తువులకు అయితే వారు నిర్ణయించిందే ధర.
తనిఖీలప్పుడే ఎమ్మార్పీ
షాపులను తరచూ బస్టాండులో విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్లు తనిఖీ చేయాలి. అడపాదడపా విజిలెన్స్ అధికారులు కూడా పరిశీలిస్తుంటారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా చేస్తుండాలి. దాడులు చేసిన ఒకటి, రెండు రోజులే ఎమ్మార్పీకి అమ్ముతున్నారు. ఆ తర్వాత షరా మామూలే. ప్రయాణికుల నుంచి రోజుకు ఐదు వరకు ఫిర్యాదులు వస్తున్నాయి.