కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన గోళ్ల పృథ్వి... సామాజిక సేవ, విద్యాభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ప్రిన్సెస్ డయానా అవార్డు 2020కి ఎంపికయ్యారు. జులై ఒకటో తేదీన లండన్‌లో వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. గుడివాడ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్, చెన్నైలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసిన పృథ్వి... అందరికీ నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో సామాజిక మార్పునకు యువత ప్రధాన చోదక శక్తిగా భావించి పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. కళాశాల దశ నుంచే పృథ్వి వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఏపీ నుంచి ఒకే ఒక్కరు
నేషనల్ యూత్ అవార్డు, నేషనల్ యూత్ ఐకాన్, నేషనల్ ఫ్రైడ్ ఎక్స్‌లెన్స్ అవార్డు, రాష్ట్రీయ యువ గౌరవ్ పురస్కార్ తదితర అవార్డులను ఇప్పటికే పృథ్వి తన సేవలకు గుర్తింపుగా అందుకున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రిన్సెస్ డయానా ఫౌండేషన్ అవార్డు ప్రకటిస్తారు. తొమ్మిదేళ్ల నుంచి 24 ఏళ్ల వయసు యువకుల్లో సామాజిక, విద్యా విషయాల్లో ఉత్తమ సేవలందిస్తోన్న వారు..ఈ అవార్డుకు నామినేట్ అవుతుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో 180 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. మన దేశంలో 23 మంది యువకులు డయానా అవార్డుకు ఎంపికయ్యారు. వారిలో ఏపీ నుంచి పృథ్వి ఒకరికే అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ఎంపికయ్యారు.
2013లో జరిగిన ఓ ఘటన తనను సామాజిక సేవ వైపు నడిపించింది. ప్రతిభావంతులైన విద్యార్థులు అనేక మంది ఉన్నప్పటికీ.. వారు సరైన దిశలో నడిచేందుకు అవగాహన లోపం అధికంగా ఉంటుంది. ఇటువంటి సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూశాను. మార్పు కోసం నాకు చేతనైనంత ప్రయత్నం చేస్తున్నాను. --- పృథ్వి, డయానా అవార్డు గ్రహీత
రక్షణ రంగంలో శాస్త్రవేత్తగా చేయటమే లక్ష్యం