గుడివాడ ఓటరు నాడి @ అంతకు ముందు..ఆ తర్వాత! - దేవినేని అవినాశ్
గుడివాడ... రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నియోజకవర్గాల్లో ఒకటి. కొడాలి నాని అడ్డాగా చెప్పుకునే ఈ స్థానంలో... పసికూన దేవినేని అవినాశ్ నెగ్గుకురాగలరా అన్న సందేహం అందరిలోనూ కలిగింది. ఈ సీటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధిష్ఠానం... ప్రత్యేక కార్యచర్యతో దూసుకెళ్తోంది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ గాలి దిశ మారుతుందన్న విశ్లేషణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. స్థానికుల స్వరంలోనూ మార్పు కనిపిస్తోంది.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో గుడివాడ ఆసక్తికర నియోజకవర్గం. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మొదటిసారి శాసన సభ్యుడిగా...పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి తెదేపాకు కంచుకోట లాంటి గుడివాడలో కొన్నేళ్లుగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. తెదేపా ఓటు బ్యాంకు ఇక్కడ నెమ్మదిగా పట్టుజారిపోయింది. 2సార్లు తెదేపా నుంచి గెలిచిన కొడలి నాని 2014 ఎన్నికలలో వైకాపా నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
అధినేత రాకతో...గెలుపు ఆశ
కొడాలి ఆరోపణలే చేస్తారని స్థానిక సమస్యలపై దృష్టి లేదన్నద్ది ఇక్కడ ప్రజాభిప్రాయం. గుడివాడలో మళ్లీ పసుపు జెండా ఎగరేస్తే ప్రయోజనం ఉంటుందన్న తెలుగు తమ్ముళ్ల ప్రచారానికి జనం స్పందిస్తున్నారు. చంద్రబాబు వచ్చి కురిపించిన వరాల జల్లు ప్రత్యర్థుల ఆశలపై నిల్లుచల్లిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధినేత చూపిన బాటలోనే వెళ్తున్న అవినాశ్... అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటున్నారు.ప్రజాస్పందన చూసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు... గుడివాడలో గత వైభవంఖాయమేనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి.