మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయనకి నివాళులర్పించారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాలను కలిపే ‘గోల్డెన్ కారిడార్’ అభివృద్ధికి వాజ్‌పేయి ఎంతో కృషి చేసారని కొనియాడారు. ఒడిశా ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్న రోజులను గవర్నర్ గుర్తుచేసుకున్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కలల ప్రాజెక్టు అని తెలిపారు.
మారుమూల గ్రామాలకు అనుసంధానం కల్పించే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం అమలులో ఆయన సహకారం మరువలేనిదని అన్నారు. పోఖ్రాన్-II పరీక్షను విజయవంతంగా నిర్వహించడం ద్వారా వాజ్‌పేయి భారతదేశ హోదాను ప్రపంచ స్థాయిలో అణు సూపర్ పవర్‌గా పెంచారన్నారు. అలాగే దేశ భద్రతను మరింత బలోపేతం చేశారని, గొప్ప వక్త, రచయిత, కవిగా రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా అందరిచేత గౌరవ వందనాలు అందుకున్నారని చెప్పారు.