ఎగువనున్న తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మున్నేరుకు భారీ వరద చేరింది. ఆ వరదకు కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద ఉన్న వంతెన ధ్వంసం అయింది. వంతెనపై ఉన్న తాగునీటి పైపులైన్లు పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను శుక్రవారం దీనిని పరిశీలించారు.
లింగాల వంతెనను పరిశీలించిన ప్రభుత్వ విప్ సామినేని
కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద ఉన్న వంతెనను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. ఇటీవల వచ్చిన వరదలకు వంతెనపై ఉన్న పైపులైన్లు ధ్వంసం అయ్యాయి. వీలైనంత త్వరగా వాటికి మరమ్మతులు చేయించాలని సామినేని అధికారులను ఆదేశించారు. ప్రజల తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని సూచించారు.
పైపులైన్లు కొట్టుకుపోవడం వల్ల వత్సవాయి, లింగాల గ్రామాలతో పాటు మరో 10 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఉదయభాను... అధికారులతో మాట్లాడారు. ఆయా గ్రామాల తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని ఆదేశించారు. పైపులైన్లకు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేయాలని సూచించారు. ధ్వంసమైన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రయత్నం చేస్తానని స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ... 'రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం'