సినిమా వాళ్లు అడగ్గానే రాయితీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్కు...పేదలకి సాయం చేసేందుకు ఎందుకు చేతులు రావట్లేదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మండిపడ్డారు. కోట్లాది రూపాయలు సంపాదించుకున్న సినిమా వాళ్ల సమస్యల పట్ల చూపిన శ్రద్ధ పేదల ఆకలి విషయంలో ఎందుకు లేదని విమర్శించారు. సినిమా వాళ్ల సమస్యలను పరిష్కరించటంలో తప్పులేదు కానీ... అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని గద్దె నిలదీశారు. విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపారని దుయ్యబట్టారు. సినిమా వాళ్లకి అడిగిందల్లా చేస్తూ పేదల సమస్యల పట్ల ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు.
'జగనన్న చేదోడు' పథకం ఓ బోగస్ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. సొంత దుకాణాలున్న రజకులు, నాయీబ్రాహ్మణులు చాలా తక్కువ మంది ఉంటారన్న ఆయన....పేరుకు మాత్రం అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.